ఖమ్మం రూరల్, నవంబర్ 14 : ఖమ్మం నగరంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో స్పెషల్ బ్రాంచ్ వింగ్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ధారావత్ బాలాజీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం సాయంత్రం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. బాలాజీ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లి మండలం బాసిక్నగర్ తండాకు చెందిన ధారావత్ బాలాజీ (40) గత కొంతకాలంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆదిత్య నగర్లో నివాసం ఉంటున్నాడు. స్పెషల్ బ్రాంచ్ వింగ్‌లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అతడికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడు. మధ్యాహ్నం వేళ ఎవరు లేని సమయంలో తన సొంత ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
బాలాజీ పిల్లలు పాఠశాల నుండి వచ్చి తలుపు తీసే సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఉన్న తండ్రిని చూసి ఒక్కసారిగా అరవడం జరిగింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ సీఐ ముష్కరాజ్, ఎస్ఐ రాయుడు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల తరలించారు. బాలాజీ మృతికి కారణాలను తెలుసుకునే పనిలో పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు.