వైరా టౌన్, సెప్టెంబర్ 07 : అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అవమానకరమని వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ‘దుశ్శాసన పర్వం’గా భావిస్తున్నామన్నారు. నియోజకవర్గమైన వైరాలోని స్థానిక రింగ్ రోడ్ సెంటర్లో తారు రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పోలీసుల ప్రవర్తనను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం తప్పా? ప్రజల పక్షాన మాట్లాడటమే వారు చేసిన పాపమా? అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా పోలీసులు జుట్టు పట్టుకుని లాగడం, తోసేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారు అసెంబ్లీ గ్రిల్స్పై పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ఈ ఘటన కేవలం ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం కాదని, రాష్ట్రంలోని మహిళలందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ఉన్న హక్కులను కాలరాస్తూ, ప్రశ్నించే గొంతులను అణచివేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలు, ప్రజా సమస్యలు బయటకు రాకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రశ్నించే వారిని అడ్డుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కట్ట కృష్ణార్జున రావు, బాణాల వెంకటేశ్వరరావు, షేక్ లాల్ అహ్మద్, కామినేని శ్రీనివాసరావు, చిలక చిన్నకోటయ్య, తిరుపతి శ్రీను, అప్పం సురేష్, ధామ లలిత్ చౌదరి, బానోత్ సక్కుబాయి, అయినాల కనకరత్నం, గుజ్జర్లపూడి దేవరాజ్, వేముల శివకృష్ణ, బట్ట భద్రయ్య, మన్యం సత్యానందం, రంగయ్య పాల్గొన్నారు.