మామిళ్లగూడెం, మే 13 : ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం పటిష్ఠ భద్రత నడుమ పోలింగ్ ముగిసింది. 1,896 పోలింగ్ కేంద్రాల్లో మొదటి సారిగా అన్ని కేంద్రాలను వెబ్ కాస్టింగ్ చేయడంతోపాటు సాంకేతికతను వినియోగించి కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టారు. కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్రాజుల సమన్వయంతో ప్రశాంత వాతావరణలో ఎన్నికలు ముగిశాయి.
పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఖమ్మం కలెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు, ఉద్యోగుల సమన్వయంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి పోలింగ్ వరకు నిరంతర పర్యవేక్షణ, సమీక్షలు, సమన్వయంతో ఎన్నికల నిర్వహణ పనులను సజావుగా జరిపించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో నిరంతర నిఘాతో అంతర్ జిల్లా, అంతర్రాష్ట్ర చెక్ పోస్టులతోపాటు పూర్తిస్థాయి ఇంటెలిజెన్స్ నివేదికలతో అల్లర్లు, అక్రమాలకు చెక్ పెట్టారు.
ఖమ్మం కలెక్టర్ గౌతమ్ దంపతులు జిల్లా అటవీ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ పోలింగ్ సజావుగా జరుగుతున్నదని, కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు.