మామిళ్లగూడెం, ఆగస్టు 23 : గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని శాంతి సామరస్యాన్ని కాపాడుకుంటూ భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. ఈ నెల 27వ తేదీ బుధవారం ప్రారంభంకానున్న గణేశ్ ఉత్సవాల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. బుధవారం ఖమ్మం నగరంలోని సూర్యతేజ ఫంక్షన్హాల్లో శాంతి కమిటీ, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ సునీల్‌దత్ మాట్లాడుతూ గణేశ్ మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని అన్నారు. బాధ్యుల వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్, నగరపాలక సంస్థ, అగ్నిమాపక, నీటిపారుదల, వైద్యారోగ్య, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి పనిచేసి శాంతియుతంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. నిమజ్జనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు, ఏసీపీలు రమణమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్బీ ఏసీపీ మహేష్, విద్యుత్‌శాఖ ఏడీ నాగార్జున, యాదగిరి పాల్గొన్నారు.