మామిళ్లగూడెం, సెప్టెంబర్ 11 : ఖమ్మం నగరంలో గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. నగరంలోని ప్రకాశ్‌నగర్ మున్నేరు వద్ద గల నిమజ్జన ప్రాంతాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి సీపీ బుధవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. శోభాయాత్ర, నిమజ్జన సమయంలో రహదారిపై వైర్లు, చెట్ల కొమ్మలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, పోలీసులతోపాటు అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, రూట్‌మ్యాప్, బారికేడ్లు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్‌రావు, సీఐ రమేశ్, కార్పొరేటర్లు లక్ష్మి, వెంకన్న పాల్గొన్నారు.