మామిళ్లగూడెం, ఆగస్టు 30 : మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని, క్రీడలతో స్నేహభావం అలవడుతుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం పరేడ్ మైదానంలో ట్రైనీ కానిస్టేబుళ్ల రెండు రోజుల క్రీడా పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
తొలుత పోలీస్ క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జెండా ఊపి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి వాలీబాల్, క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 70 శాతం శిక్షణా కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న 263 మంది సివిల్, ఏఆర్ ట్రైనీ కానిస్టేబుళ్లను అభినందించారు.
నిత్యం ఇండోర్, అవుట్ డోర్ శిక్షణలో నిమగ్నమై ఉన్న సిబ్బందికి మానసిక ప్రశాంతత కోసం వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీటీసీ ప్రిన్సిపాల్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేశ్‌కుమార్, ఏఆర్ అడిషనల్ డీసీపీ విజయబాబు, ఏసీపీలు రవి, సర్సయ్య, ఆర్ఐలు అప్పలనాయుడు, నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.