ఖమ్మం, ఏప్రిల్ 11: ఆన్లైన్ బెట్టింగ్, మోసాలు, లోన్‌యాప్ కార్యకలాపాలపై నిఘా పెంచాలని సెక్టార్ ఆఫీసర్లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. శుక్రవారం అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సెక్టార్ ఆఫీసర్లకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హనుమాన్ జయంతి ర్యాలీ ప్రశాంత వాతావరణంలో జరిగేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ ద్వారా నేరాలు నియంత్రణలో ఉంటాయన్నారు. ఏడీసీపీ ప్రసాద్‌రావు పాల్గొన్నారు.