‘పాత మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు ఇస్తాం’ అంటూ మీ ఊరిలోకి ఎవరైనా వస్తున్నారా..? మీ వద్దనున్న పాత మొబైల్ ఫోన్‌ను ఇచ్చేసి డబ్బులుగానీ, ప్లాస్టిక్ సామాన్లుగానీ తీసుకుంటున్నారా..? ఈ పాత మొబైల్స్ తీసుకెళ్లి ఏం చేస్తారోనన్న సందేహం ఎప్పుడైనా కలిగిందా..? మీ సమాధానం ‘ఔను/కాదు’.. ఏదైనా సరే, ఈ వార్తను మాత్రం చివరిదాకా తప్పక చదవాల్సిందే.
పర్ణశాల, అక్టోబర్ 9: మండలంలోని పెద్దనల్లబెల్లి గ్రామ సెంటర్ వద్ద దుమ్ముగూడెం పోలీసులు ఈ నెల 8వ తేదీన సాయంత్రం వేళ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నలుగురు వ్యక్తులు నాలుగు బైక్‌లపై దగ్గరగా వచ్చారు. పోలీసులను చూసీచూడగానే.. తత్తరపాటుతో వెంటనే వెనుదిరిగి లక్ష్మీనగరం వైపు వేగంగా వెళ్తున్నారు. వారిని పోలీసులు వెంటనే వెంబడించారు. ఆ నలుగురిలో ఒకడిని నల్లబెల్లి శివారులో పట్టుకుని విచారించారు. బీహార్ రాష్ర్టానికి చెందిన ఇతడి పేరు అక్తర్ ఆలీఖాన్. ‘పాత మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు ఇస్తాం’ అంటూ, ఊరూరా తిరుగుతుంటాడు. పాతవి, పాడైన మొబైల్స్ తీసుకుని ప్లాస్టిక్ సామాన్లు ఇస్తుంటాడు. ఈ మొబైల్స్‌ను బీహార్‌కు తీసుకెళ్తాడు.
వీటిని తన్వీర్, హలీమ్ అనే ఇద్దరు సైబర్ నేరగాళ్లకు ఇస్తాడు. ఆ నేరగాళ్లు ఈ మొబైల్ ఫోన్ల ఐఈఎంఐ నంబర్లు, మదర్ బోర్డు, సాఫ్ట్వేర్ సేకరించి, మరమ్మతులు చేస్తారు. ఆ తర్వాత, ఆ ఫోన్ల ద్వారా సైబర్ నేరాలు చేస్తారు. ఇలా వచ్చిన డబ్బులో నుంచి ఈ మొబైల్ ఫోన్లను సేకరించి తెచ్చిన అక్తర్ ఆలీఖాన్‌కు కమీషన్ ఇస్తారు. ఈ ఆలీఖాన్ నుంచి 150 పాత మొబైల్ ఫోన్లు, ప్లాస్టిక్ సామాన్లు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఈ వివరాలను దుమ్ముగూడెం పోలీసులు గురువారం విలేకరులకు వెల్లడించారు. “పాత మొబైల్ ఫోన్లు కొంటామనిగానీ, వాటికి ప్లాస్టిక్ సామాన్లు ఇస్తామనిగానీ ఎవరైనా మీ ఊరికి/ఇండ్ల ముందుకు వస్తుంటారు. వారికి మీ ఫోన్లను ఇవ్వకూడదు” అని హెచ్చరించారు.