భద్రాచలం, జనవరి 26: ఏజెన్సీలో గిరిజనుల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం ఆయన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఐటీడీఏ పరిధిలో 60 ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, 21 వసతి గృహాలు, 34 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, 233 ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయని, వాటి పరిధిలో 31,960 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. వారికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా విదేశీల్లో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు విద్యాసంవత్సరంలో రూ.17.61 కోట్ల సాయం అందిస్తామన్నారు. పదోతరగతి ఫలితాల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ఇటీవల కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహించామన్నారు. పోటీల్లో భద్రాచలం జోన్ రెండో ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిందని కొనియాడారు.
యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఖమ్మం, ఇల్లెందు యూత్ ట్రైనింగ్ సెంటర్లలో 75మంది గిరిజన నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చామన్నారు. భద్రాచలం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఉద్యోగ మేళా నిర్వహించి 123 మంది యువతకు హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలల్లో ఉపాధి కల్పించామన్నారు. సర్కార్ విడుదల చేసిన రూ.5 కోట్లతో ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, జీపీ స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కొండరెడ్ల ఆరోగ్య పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఎనిమిది హ్యాబిటేషన్లలో హెల్త్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ వారికి వైద్యపరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్యసాయం అవసరమైన వారికి ప్రధాన ఆసుపత్రులకు సిఫార్సు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్, ట్రైబల్ వెల్ఫేర్‌శాఖ డీడీ మణెమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, మొబైల్ కోర్ట్ జడ్జి బీ శివాజీ, జీసీసీ మేనేజర్ విజయ్‌కుమార్, గురుకులాల ఆర్సీవో వెంకటేశ్వరరాజు, ఏవో భీం, అగ్రికల్చర్ ఏడీ ఉదయభాస్కర్, పీహెచ్‌వో అశోక్, జేడీఎం హరికృష్ణ, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్సీసీ అధికారి బీ నాగులు, చలపతి, బీ తారాచంద్ పాల్గొన్నారు.