కారేపల్లి,ఆగస్టు 24 : గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల నాగేశ్వరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలో ఆదివారం ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అనంతారపు వెంకటాచారితో కలిసి విలేకరుల సమావేశం మాట్లాడారు. గతంలో వైయస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ దవాఖానల్లో1000 గంటలు శిక్షణ ఇచ్చారన్నారు.
శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు జారీ చేయలేదన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామీణ వైద్యులను పారా మెడికల్ బోర్డు కింద తీసుకోని శిక్షణ ఇచ్చేందుకు ప్రతి ఒక్కరి నుండి రూ.200లను డిడి కట్టించుకున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది గ్రామీణ వైద్యులు ఉన్నట్లు పేర్కొన్నారు. అనునిత్యం గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవ అందిస్తున్న గ్రామీణ వైద్యులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరికొద్ది రోజుల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీలు అందిస్తున్న ప్రాథమిక సేవలపై కనువిప్పు కల్పించుటకు ధర్నా చేసేందుకు కార్యచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ వైద్యుల సేవలను గుర్తించి స్థానికంగా వారికి ఎటువంటి హాని కలగకుండా రక్షణ కల్పించాలని కోరారు.