ఖమ్మం రూరల్, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలోని ప్రతి గ్రామంలో గులాబీ జెండాలు ఎగురవేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం రూరల్ మండలంలోని 32 గ్రామాలు, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మరో 32 డివిజన్లో పార్టీ పండుగ జరుపుకునేందుకు గులాబీ సైనికులు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రతి గ్రామ కూడలిలో పార్టీ జెండాలు ఎగురవేయాలన్నారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు తిరుమలపాలెం మండల కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
ఇందుకుగాను మండలంలో 50 ప్రత్యేక బస్సులు, మరో 30 కార్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం ఇంటి నుంచి బయల్దేరింది మొదలు తిరిగి సురక్షితంగా ఇంటికి వచ్చే విధంగా గ్రామ కమిటీ బాధ్యులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగునీరు, ఆహారం, ఇతర అవసరాలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలన్నారు. వేడుకలను విజయవంతం చేసేందుకు పక్షం రోజుల నుంచి అహర్నిశలు కృషి చేస్తున్న గులాబీ సైనికులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 15 వేల మంది బీఆర్ఎస్ సైనికులతో ఛలో వరంగల్ విజయవంతంగా చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు.