కారేపల్లి, ఏప్రిల్ 15 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల విద్యా వనరుల కార్యాలయ ఆవరణలోని భవిత కేంద్రంలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో మంగళవారం దివ్యాంగ బాలలకు ఫిజియోథెరపీ నిర్వహించారు. ఈ ఫిజియోథెరపీ క్యాంప్‌ను మండల విద్యాశాఖాధికారి జె.జయరాజు సందర్శించి ఫిజియోథెరపీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కారేపల్లి మండల పరిధిలో ఉన్న శారీరక వైకల్యం, మెదడు పక్షవాతం గల బాలల తల్లిదండ్రులు భవిత కేంద్రంలో నిర్వహించే ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కారేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో దివ్యాంగ బాలబాలికల భవితా కేంద్రం సేవలందిస్తుందన్నారు..అనంతరం బాలల తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.19 ఏళ్ల లోపు వయసు గల శరీరక వైకల్యం కలిగిన వారికి ఈ సేవలు అందించడం జరుగుతుందన్నారు. పుట్టుకతో వచ్చే పాక్షిక పక్షవాతం, శరీరంలోని కండరాల మధ్య సమన్వయ లోపంతో బాధపడుతూ కూర్చోడంలోనూ, నిలబడడం, అడుగులు వేయడం, నడవడంలోనూ ఇబ్బంది పడే చిన్నారులకు ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ రూతమ్మ, పీఈఆర్‌పీ శైలజ పాల్గొన్నారు.