నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 26: ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఏ బంకు చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి పెట్రోల్, డీజిల్ కోసం జనం బంకుల చుట్టూ పరుగులు పెడుతున్నారు.

అక్కడక్కడ కొద్దిపాటి స్టాక్ ఉన్న బంకుల వద్ద ఆటోలు, కార్లు, బైకుల యజమానులు ఇంధనం కోసం గంటలకొద్దీ వేచిచూస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లపై ఆధారపడుతున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లకు డిమాండ్ ఉన్నప్పటికీ డీజిల్ లేకపోవడంతో కిరాయికి వెళ్లలేకపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో దానికి అనుగుణంగా ఆయిల్ కంపెనీలు ధరలను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా పశ్చిమబంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ర్టాల్లో ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓట్లను రాబట్టుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయిల్ ధరలను పెంచేందుకు వెనకడుగు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

రాష్ర్టాల్లో డిమాండ్లకు తగిన విధంగా ఆయిల్ సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఆయిల్ బంక్ యజమానులు బ్లాక్ మార్కెట్లో విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇతర రాష్ర్టాల్లో ఎన్నికలు ముగియడంతో డీలర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత రెండురోజులుగా పెట్రోల్, డీజిల్ తీవ్ర కొరత నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అధికార యంత్రాంగం శ్రేష్టలుడిగి చూస్తున్నది. పెట్రోల్, డీజిల్‌ను బ్లాక్ మార్కెట్లో విక్రయించే వ్యాపారులపై సైతం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నది.
బంక్‌లో ఉండాల్సిన పెట్రోల్, డీజిల్ బ్లాక్‌లో విక్రయించే వ్యాపారుల వద్దకు చేరి అమాంతం ఒక లీటర్ పెట్రోల్ ధర సుమారు 300, డీజిల్ ధర 280కి చేరింది. రోజువారి ఆటో, ఇతర ట్యాక్సీలు నడుపుకుని జీవనం కొనసాగించే సామాన్య ప్రజలపై ప్రభావం తీవ్రంగా పడుతున్నది. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తున్నది. సింగరేణి, నవభారత్, బీపీఎల్ కర్మాగారాలకు వెళ్లే భారీ వాహనాలకు డీజిల్ కొరత ఏర్పడింది.
ఆయిల్ సంస్థల స్టాక్ పాయింట్ల వద్ద స్టాక్ ఉన్నప్పటికీ డీలర్లకు సరిపడా సరఫరా చేయడం లేదు. యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచకపోవడంతో ఆయిల్ సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన రాయితీలు చెల్లించకపోవడం కూడా ఒక కారణం. ఐదు రాష్ర్టాల ఎన్నికల కారణంగా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు.
– ఈశ్వరప్రగడ రంగనాథ్, ఆయిల్ బంక్‌ల డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
పెట్రోల్, డీజిల్ కొరత సమస్య రెండ్రోజుల్లో పరిష్కారమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా సమస్య కొనసాగుతోంది. ఆయిల్ సంస్థలు రేషనలైజేషన్ చేస్తున్నాయి. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే గూడ్స్ వాహనాలకు తెలంగాణలో డీజిల్ విక్రయించేందుకు ఆంక్షలు విధించారు. తెలంగాణ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఆయిల్ కొరతలేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.
– చందన్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఖమ్మం