దమ్మపేట రూరల్, జూన్ 17: అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చిన సీపీఎం అనుబంధ అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) బృందానికి చేదు అనుభవం ఎదురైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫ్యాక్టరీ యాజమాన్యం అనుమతికి నిరాకరించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏఐకేఎస్ బృందం సభ్యులు ఫ్యాక్టరీ గేటు వద్ద నిరసన తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… రాష్ట్రంలో పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న నాసిరకం, హాఫ్టైప్ పామాయిల్ మొక్కల సమస్యలను తెలుసుకునేందుకు ఏఐకేఎస్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నది.
దానిలో భాగంగా మంగళవారం ఏఐకేఎస్ రాష్ట్ర కార్యదర్శి సాగర్ ఆధ్వర్యంలో ఓ బృందం ఖమ్మం జిల్లాలోని వేంసూరు, సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో బాధిత రైతుల తోటలను పరిశీలించింది. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని అప్పారావుపేట ఫ్యాక్టరీని సందర్శించడానికి అక్కడికి చేరుకున్న బృందానికి ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి అనుమతి నిరాకరించారు. దీంతో ఫ్యాక్టరీ గేటు వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఏఐకేఎస్ రాష్ట్ర కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇలా అనుమతికి నిరాకరించినట్లు తెలిపారు. ఫ్యాక్టరీలో 19.42శాతం ఓఈఆర్(ఆయిల్ ఎక్షట్రాక్షన్ రేట్) కంటే అధికంగా వస్తున్న విషయం బహిర్గతమవుతుందన్న భయంతోనే అనుమతి నిరాకరించారని ఆరోపించారు. ఫ్యాక్టరీలో గత ఏడాది ఏర్పాటుచేసిన వర్టికల్ స్టరిలైజర్ విఫలమైందని, దీనిని దాచిఉంచడానికే తమని అడ్డుకున్నారన్నారు. స్వయంగా పామాయిల్ రైతులమైన తమను ఫ్యాక్టరీలోకి అనుమతించకపోవడం యాజమాన్యం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు.
ప్రభుత్వరంగ సంస్థలో ఇంత నిర్బంధం తగదన్నారు. హాఫ్టైప్ మొక్కలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పామాయిల్ తోటలను శాస్త్రవేత్తల బృందంతో తనిఖీలు చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, యలమంచిలి వంశీకృష్ణ, అన్నవరపు సత్యనారాయణ, పుల్లయ్య, ఆయిల్ఫామ్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, బాధిత రైతులు కారం శ్రీరాములు, చెలికాని సూరిబాబు, దొడ్డా చక్రధర్‌రెడ్డి, పాండు, శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, రాజబాబు పాల్గొన్నారు.