ఖమ్మం నగరంలో శుక్రవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విస్తృతంగా పర్యటించారు. తొలుత నూతన కార్పొరేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. 44, 46 డివిజన్లలో సీసీ రహదారులను ప్రారంభించారు. అనంతరం 18వ డివిజన్లో 134 మందికి, 53వ డివిజన్లో 71 మందికి ఇండ్ల పట్టాలను పంపిణీ చేసి లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు ఇంటిపై శాశ్వత హక్కులు కల్పించాలనే ఉద్దేశ్యంతో పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. నగరవాసులకు మెరుగైన సేవలు అందించేందుకు అత్యాధునిక వసతులతో నూతన నగర పాలక సంస్థ కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని, దీన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు.
– ఖమ్మం, మార్చి 4
ఖమ్మం నగర ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలందించేందుకు అత్యాధునిక వసతులతో నగర పాలక సంస్థ నూతన కార్యాలయాన్ని అతి త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. నగరంలో ముగింపు దశలో ఉన్న నూతన కేఎంసీ భవన పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. సుమారు 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలంగా నిర్మిస్తున్న కార్యాలయ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారలను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ తర్వాత ఖమ్మం కార్యాలయాన్నే అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ త్వరలోనే వచ్చి ఈ భవనాన్ని ప్రారంభిస్తారని అన్నారు.
నగరంలో రూ.30 కోట్లతో అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అజయ్‌కుమార్ తెలిపారు. 44వ డివిజన్లో రూ.25.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను మేయర్ నీరజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక అభివృద్ధి నిధులతో నగరంలో 140 అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. ఆధునిక టెక్నాలజీతో వాక్యుమ్ డీవాటర్డ్ ఫోకలరింగ్ (వీడీఎఫ్) కలిగిన సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. 46వ డివిజన్లో రూ.56.90 లక్షలతో నిర్మించిన వీడీఎఫ్ సీసీ రోడ్డునూ మంత్రి ప్రారంభించారు.
నగరంలో పేదలు ఎంతో కాలంగా ఇళ్ల పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నందున వారికి ఇళ్ల పట్టాలు అందించి సముచిత స్థానం కల్పిస్తున్నట్లు మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. 18వ డివిజన్ రామకృష్ణానగర్‌లో 134 మందికి, 53వ డివిజన్ దొరన్నకాలనీ, సుల్తాన్‌నగర్‌లో 71 మందికి శాశ్వత ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. పట్టాలు పొందిన వారు తక్షణమమే మీ సేవలో ఆయా పట్టాతో జీవో 58 కింద రెగ్యులర్ చేసుకొని అడ్రస్ కూడా మార్చుకోవాలని సూచించారు. అనంతరం సుల్తాన్‌నగర్‌లో లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు పడగాల శ్రీవిద్య, కమర్తపు మురళి, కురాకుల వలరాజు, పాలెపు విజయ వెంకటరమణ, కన్నం వైష్ణవి, తోట గోవిందమ్మ, మందడపు లక్ష్మీ మనోహర్, కొత్తపల్లి నీరజ, ఎస్ఈ ఆంజనేయ ప్రసాద్, ఈఈ కృష్ణలాల్, డీఈఈ రంగారావు. టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పాలెపు వెంకటరమణ, కన్నం ప్రసన్నకృష్ణ, తోట రామారావు, విజయ్, వీరభద్రం, జానీ, తహసీల్దార్ శైలజ తదితరులు పాల్గొన్నారు.