కారేపల్లి, ఏప్రిల్ 11 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని పేరేపల్లి గ్రామంలో కొలువైన, మహిళల ఆరాధ్య దైవంగా పిలువబడే గురువమ్మ తల్లి జాతర ఈ నెల 12న (శనివారం) ప్రారంభం కానుంది. ఈ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువమ్మ తల్లి కల్యాణాన్ని ప్రతీ ఏడాది ఏప్రిల్ మాసం పౌర్ణమి గడియల్లో నిర్వహిస్తారు. ఆరు రోజుల పాటు జరిగే గురువమ్మ తల్లి మహోత్సవాల్లో మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది. ఇల్లెందు సబ్ డివిజన్, ఖమ్మం జిల్లా నలుమూలలతో పాటు, వరంగల్ జిల్లా నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కొలిచిన మహిళలకు కోర్కెలు తీర్చే తల్లిగా పేరుగాంచిన గురువమ్మ తల్లికి పసుపు కుంకుమల నాడు వేలాది మంది మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఈ నెల 12న నిత్యపూజలు, పసుపు కుంకుమలు, 13న జలబిందెలు, 14న దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక కుంకుమార్చన పూజలు, 15న ఘనంగా అమ్మవారి కల్యాణంతో పాటు అదేరోజు రాత్రి ఊరేగింపు (అమ్మవారి రథోత్సవం), 16న పూలకొప్పెర, 17న గ్రామ ప్రభలు, 18న బోనాల (నైవేద్యాలు) పండుగ జరుగనుంది. దీంతో పాటు మహోత్సవాలు జరగనున్న ఆరు రోజుల్లో ప్రతీరోజు ఉదయం 9 గంటల నుండి. 11 గంటల వరకు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించబడుతాయి.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి తాలూకా కానుగంచి గానుగపాడు గ్రామానికి చెందిన నాయినూడు నర్సమ్మ, రాంరెడ్డి దంపతుల నాల్గొవ సంతానం గురువమ్మ. ముగ్గురు కుమార్తెల వివాహం అనంతరం గురువమ్మను సింగరేణి మండలం మాదారం గ్రామానికి చెందిన సర్విరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఒక కుమార్తె. వ్యవసాయ కుటుంబం. ఉన్నది. ఐతే గురువమ్మ భర్త సర్విరెడ్డి మాదారం గ్రామ కరుణం మాదిరాజు వెంకయ్య అనే భూస్వామి వద్దకు వచ్చి కౌలుకు చేసుకునేందుకు కొంత భూమి ఇవ్వాలని అడిగాడు. కరుణం మాదారంలో భూమి ఖాళీగా లేదు గార్ల మండలం పోచారం గ్రామంలో కొంత ఉందని చెప్పాడు. దీంతో సర్విరెడ్డి సరే అక్కడైనా పర్వాలేదు వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పగా కరుణం అతనికి భూమిని కౌలుకు ఇచ్చాడు.
సర్విరెడ్డి సతీమణి గురువమ్మ మంచి రూపవతి. భర్తతో పాటు అప్పుడప్పుడు వ్యవసాయ పనులకు వెళ్తూ ఉండేది. ఆ సమయంలో కరుణం దొరవారికి గురువమ్మపై కన్నుపడింది. తనను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే దురాలోచనతో ఉండేవాడు. ఈ విషయంలో గురువమ్మ సోదరుడు వీరారెడ్డి కూడా కరుణానికి సహకరించేవాడు. ఒకరోజు ఒంటరిగా ఉన్న గురువమ్మను తన కోరిక తీర్చాలని కరుణం అడుగగా ఆమె ఆగ్రహించింది. తనపై అలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోవద్దని, తాను తలుచుకుంటే మసైపోతావ్ అంటూ హెచ్చరించింది. ఈ క్రమంలో పోచారం భూమిలో వేసిన జొన్నచేను కోసి కుప్పవేయగా దానికి కాపలాగా రాత్రి పడుకునేందుకు సర్విరెడ్డి వెళ్లాడు. ఆ సమయంలో గురువమ్మ తల్లిగారింటికి వెళ్లింది. గురువమ్మ లొంగలేదనే కక్షతో కరుణం మాదిరాజు వెంకయ్య చేను వద్ద పడుకున్న ఆమె భర్త సర్విరెడ్డిని హత్య చేయించాడు. భర్త మృతి విషయాన్ని తల్లిగారింటి వద్దనున్న గురువమ్మ చాకలి ద్వారా తెలుసుకుంది. తన భర్తను ఖచ్చితంగా కరుణమే చంపించాడని అనుమానం వ్యక్తం చేస్తూ అక్కడ నుండి బయల్దేరి వచ్చింది.
తన భర్త సర్విరెడ్డి దహన సంస్కారాలు పూర్తి (శవాన్ని కాల్చివేసేందుకు) చేసేందుకు భూమి కావాలని గ్రామస్తులను గురువమ్మ వేడుకొంది. ఎవరు కూడా తమ భూమిలో శవాన్ని కాల్చివేసేందుకు ముందుకు రాలేదు. ఇదే అదునుగా భావించిన కరుణం గురువమ్మను ఇప్పటికైనా తన కోరికను తీర్చితే భర్త దహన సంస్కారాలకు పూర్తి ఏర్పాట్లు చేపిస్తానని అడిగాడు. అతడి కోరికను నిరాకరించిన గురువమ్మ భర్త శవం పక్కనే రోదిస్తూ కూర్చుంది. ఇంతలో అక్కడకు పేరేపల్లి గ్రామానికి చెందిన ఓ హరిజన వ్యక్తి వచ్చి అమ్మా.నాకు కొంత భూమి ఉంది. నీ భర్తను అక్కడకు తీసుకువచ్చి అందులో దహనం చేయి అని చెప్పగా గురువమ్మ ఒప్పుకుని భర్త శవాన్ని పేరేపల్లి (ప్రస్తుతం గురువమ్మఉన్న ప్రదేశం) కి తీసుకువెళ్లింది.
గ్రామస్తులందరిని ఒక దగ్గరకు పిలిపించి భర్తతో పాటు తనను కూడా చితిలో పెట్టి కాల్చివేయమని (సతి సహగమనం) గురువమ్మ చెప్పింది. గ్రామస్తుల సహకారంతో ఆ ప్రదేశంలో నీళ్లకు, పాలకు, అగ్నికి వేర్వేరుగా గుండాలను ఏర్పాటు చేయించింది. జలాభిషేకం, క్షీరాభిషేకం జరిపిన తర్వాత కూతురు చంద్రమ్మతో పాటు గురువమ్మ భర్త శవంతో అగ్నికి ఆహుతైంది. కాసేపటి తర్వాత గురువమ్మ మరలా ప్రత్యక్ష మైంది. సోదరుడు వీరారెడ్డి కూడా పేరేపల్లికి రావడంతో జీవితంలో తన మొహం చూపించవద్దని శపించి బండరాయిగా మార్చింది. అనంతరం ముత్తయిదువులకు కుంకుమబరిణలు అందజేసింది. తాను పతివ్రతగా మిగిలిపోవాలనే ఉద్దేశ్యంతోనే ఈపని చేసినట్లు వారితో చెప్పింది. మీకు ఎటువంటి బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినా తనను తలచుకుంటే అండగా ఉంటానని హామీ ఇచ్చింది. తనకు ఇదే ప్రదేశంలో గుడి నిర్మించాలని గ్రామస్తులకు చెప్పడంతో అక్కడ ఆలయాన్ని నిర్మించి ప్రతీ ఏటా గురువమ్మ అమ్మవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ వస్తున్నారు.
Guruvamma Jatara : రేపటి నుంచే గురువమ్మ జాతర… తరలిరానున్న భక్తజనం