మామిళ్లగూడెం, డిసెంబర్ 29: జిల్లాలో ప్రభుత్వ పథకాల పంపిణీలో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ప్రొటోకాల్ పాటించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అధికారులకు సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో ఆయన వివిధ పథకాల తీరుపై సమీక్షించారు. జిల్లాలో పశుగణాభివృద్ధి కోసం జిల్లా వ్యాప్తంగా పశువులకు టీకాలు, ఇతర వైద్య చికిత్సలు చేసేందుకు స్టాండ్లు అవసరమని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుమనోహర్ తెలపడంతో వెంటనే స్పందించిన జడ్పీ చైర్మన్.. జిల్లా పరిషత్ తరఫున 200 స్టాండ్లు మంజూరు చేస్తామన్నారు.
వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు. జిల్లాలో కస్తూర్బా జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సరిపడా బోధనాసిబ్బంది లేనందున వెంటనే నియమకాలు చేయాలని డీఈవో సోమశేఖర్శర్మకు జడ్పీ చైర్మన్ సూచించారు. అంగన్వాడీలకు సరఫరా అవుతున్న గుడ్లు నాణ్యంగా లేవని, గుత్తేదారులు చిన్న సైజు గుడ్లు సరఫరా చేస్తున్నారని సభ్యులు అడిగిన ప్రశ్నకు జిల్లా సంక్షేమాధికారి ఇచ్చిన సమాచారంతో అసంతృప్తి చెందని చైర్మన్.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంజినీరింగ్శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతన్న పనులు వేగవంతం చేయాలని సూచించారు. జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డిప్యూటీ సీఈవో కే.చంద్రశేఖర్, వైస్ చైర్పర్సన్ మరికంటి ధనలక్ష్మి, జడ్పీటీసీలు ప్రమీల, రామోహన్రావు, సుమలత, తిరుపతి కిశోర్, కవిత, ప్రియాంక, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.