ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు వెళ్లిన అధికారులకు నిరసనలు, నిలదీతలు ఎదురయ్యాయి. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు, అధికారులతో వెళ్లిన వారిని అర్హులైన నిరుపేదలు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు కాంగ్రెస్ కమిటీలు అయ్యాయని, అయినోళ్లు, ఉన్నోళ్లకే ఇండ్లా అంటూ.. నిరుపేదలు మండిపడ్డారు. తిరుమలాయపాలెం, కరకగూడెం, బోనకల్లు, ఇల్లెందు పట్టణాల్లో దరఖాస్తుదారులు నిరసన వ్యక్తం చేయడంతోపాటు ఆందోళనలు చేశారు. ప్రభుత్వం, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక అధికారులు వెనుదిరిగారు.
తిరుమలాయపాలెం, ఏప్రిల్ 30 : ఇందిరమ్మ కమిటీలు ధనికులు, భూములు ఉన్న వారికి, కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు మంజూరు చేశారని ఆరోపిస్తూ పలువురు మహిళలు తిరుమలాయపాలె మండలం బచ్చోడు గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేసి బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడిసెలు, రేకుల ఇళ్లు ఉన్న వారికి ఇండ్లు ఇవ్వకుండా ధనికులకే ఇండ్లు మంజూరు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీలు కాంగ్రెస్ కమిటీలుగా మారాయని, వెంటనే వాటిని రద్దు చేసి అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దారమళ్ల రాణి, నందిపాటి రేణుక, జిల్లా నాగమణి, గొర్రెపాటి ధనలక్ష్మి, నందిపాటి ప్రశాంతి, గొర్రెపాటి కుమారి, స్వరూప, సీసీఐ(ఎంఎల్) న్యూడమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
బోనకల్లు, ఏప్రిల్ 30 : అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఆ పార్టీ నాయకులనే ఇళ్లు మంజూరు చేయడంపై ఆగ్రహిస్తూ ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం-ఎల్ గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలువురు, సీపీఎం నాయకులు నల్లమోతు వాణి, తమ్మారపు లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రామానికి మంజూరైన 24 ఇళ్లకు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉన్నత వర్గాలకు చెందిన వారిని రహస్యంగా ఎంపిక చేశారని ఆరోపించారు.
తాము పూరి గుడిసెలు, రేకుల షెడ్లలో ఉంటూ అర్హులమైనప్పటికీ ఇండ్లు ఎందుకు మంజూరు చేయలేదని పంచాయతీ కార్యదర్శి మురళిని నిలదీశారు. ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తే మనుగడ సాగించలేరని, ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అనంతరం కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పసుపులేటి నరేశ్, జొన్నలగడ్డ సునీత, కల్యాణపు శ్రీనివాసరావు, యాదయ్య, సైదాబి, వలరాజు తదితరులు పాల్గొన్నారు.
కరకగూడెం, ఏప్రిల్ 30 : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, అనర్హులకు ఒక్క ఇల్లు ఇచ్చినా ఊర్కునేది లేదని హెచ్చరిస్తూ కరకగూడెం మండలం చొప్పాల గ్రామస్తులు బుధవారం నిరసన తెలిపారు. చొప్పాల పంచాయతీ పరిధిలో 24 మందికి ఇండ్లు మంజూరయ్యాయని సర్వేకు వచ్చిన అధికారులు గ్రామస్తులకు వివరించారు. దీంతో అర్హులను పక్కనపెట్టి.. భూములు, ఉద్యోగాలు ఉన్న వారికి ఇండ్లు ఎలా మంజూరు చేశారంటూ వాగ్వాదానికి దిగారు.
సెంటు భూమి లేని వారిని గుర్తించి ఇండ్లు మంజూరు చేయాలని ఆందోళనకు దిగారు. ఉద్యోగాలు, పొలాలు ఉన్న వారికి ఏం తక్కువైందని జాబితాలో వారి పేర్లను చేర్చారని అధికారులను నిలదీశారు. గ్రామస్తులు అధికారులను చట్టుముట్టడంతో అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఏవిధంగా అర్హులను గుర్తించారని గ్రామస్తులు మండిపడ్డారు. దీనిపై కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు చెప్పారు.
ఇల్లెందు, ఏప్రిల్ 30 : నిరుపేదలమైన తమకు ఇండ్లు ఇవ్వకుండా.. కాంగ్రెస్ నాయకులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేయడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి 3వ వార్డుకు చెందిన ప్రజలు బుధవారం ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులను నిలదీశారు. సర్వేకు వచ్చిన అధికారులు వార్డులో 72 మంది ఉండగా.. అందులో నిరుపేదలైన 13 మందికి ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. దీంతో నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు, ధనవంతులకు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల మధ్య ఇండ్ల కేటాయింపుపై గొడవ జరిగింది. ఇల్లు మంజూరుకు రూ.లక్ష తీసుకున్నాను.. ఎవరేం చేస్తారో చేసుకోండి అంటూ పరస్పరం దూషించుకున్నారు.