బోనకల్లు, ఆగస్టు 02 : నిమిషాల వ్యవధిలో రైల్వే గేట్ మూసివేస్తుండడంతో ప్రజలు నానా అవస్థలు, రైల్వే గేట్ వద్ద పడిగాపులు కాయాల్సి పరిస్థితి ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని గోవిందాపురం గ్రామం వద్ద నెలకొంది. విజయవాడ – కాజీపేట ప్రధాన రైల్వే మార్గంలో మూడో లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న రైల్వే గేటు సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి మంజూరైంది. కానీ నిర్మాణ పనులు మాత్రం చేపట్ట పోవడంతో ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో పాటు ఈ మార్గంలో ప్రతి 10 నిమిషాలకు ఒక ట్రైన్ ఏదో ఒక లైన్ పై వెళ్తుంటుంది. ఈ కారణంగా గ్రామ సమీపంలో ఉన్న రైల్వే గేటును పదే పదే మూసి వేయడం వల్ల వాహనదారులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు.
అంతేకాకుండా స్కూల్ పిల్లలు సైతం గంటల తరబడి రైల్వే గేటు వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఏర్పడింది. గత రెండేళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలు రాకపోకలు సాగించాలంటే మరో మార్గం లేక గేటు వద్దనే వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించింది. అత్యవసర సమయంలో ఎటు వెళ్లాలన్న మరో మార్గం లేక ఈ గేట్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు త్వరతిగతిన మూడో లైన్ నిర్మాణ పనులు ముగించి, నూతనంగా మంజూరైన రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని ఇక్కడి ప్రాంత వాసులు కోరుతున్నారు.