కారేపల్లి,నవంబర్ 14 : ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండలం మాణిక్యారం గ్రామ ప్రజలు పాలకుల పట్టింపు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సమస్యలతో సతమతమవుతున్నారు. గ్రామం నడిబొడ్డులో గల రామాలయం పక్కన మిషన్ భగీరథ మెయిన్ పైపు లీకై నీళ్లు రోడ్డు మీద పారుతున్నాయని గుడి తండావాసులు తెలిపారు. వాటర్ ట్యాంకు నుండి ఇంటింటికీ నల్లాల ద్వారా సరఫరా అవుతున్న నీళ్లు లీకేజీల కారణంగా కలుషితం కావడంతో తాగడం లేదని స్థానికులు తెలిపారు.
దీంతో గ్రామ శివారులో ఉన్న చేతి పంపు నుండి తాగు నీళ్లు తెచ్చుకుంటున్నామన్నారు. అదేవిధంగా సైడ్ కాలువలలో మురికి నీళ్లు నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తద్వారా లార్వా వృద్ధి చెంది దోమలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. రాత్రి వేళల్లో వీధిలైట్లు సక్రమంగా వెలగకపోవడంతో అంధకారంలో ఉన్న వీధులలో తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
గ్రామంలోని అంతర్గత రోడ్లు చినుకు పడితే చిత్తడి అవుతున్నాయని వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు బురద మయమైన వీధి రోడ్లలో నడవలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయి పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకు వెళ్తే పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మాణిక్యారం గ్రామపంచాయతీలో నెలకొన్న సమస్యలను స్థానిక పంచాయతీ అధికారులు పర్యటించి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.