మధిర, మార్చి 22 : తమకు మిషన్ భగీరథ నీరు అందించాలని కోరుతూ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపిన ఘటన ఆత్కూరు గ్రామంలోని కుంటబీడు కాలనీలో శనివారం చోటు చేసుకుంది. కూలీలు ఎక్కువగా నివసించే ప్రాంతం కావడంతో వారం రోజులుగా తాగునీరు రాకపోవడంతో ఇబ్బందిపడుతున్నామని, తమ ప్రాంతానికి మిషన్ భగీరథ పైపులైన్ వేసి మంచినీళ్లు అందించాలని కాలనీ మహిళలు డిమాండ్ చేశారు.
సీపీఎం మండల కార్యదర్శి మందా సైదులు మాట్లాడుతూ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయాలని, అవసరం ఉన్నచోట చేతిపంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు అంకె శివయ్య, గ్రామస్తులు పల్లెపోగు జానకమ్మ, పల్లెపోగు నాగయ్య, పలిమల వెంకటరత్నం, మీనుగు పద్మ, వెంకటకుమారి, మేరి, యేసుమణి, లక్ష్మి, కమలమ్మ, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు.