ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జనవరి 21: రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామసభలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలిరోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల ప్రణాళికలో భాగంగా మొదటి రోజు ఒక్కో మండలంలో నాలుగు నుంచి ఆరు గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు.
ఈ గ్రామసభలకు మండల, జిల్లాస్థాయి అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. గ్రామకార్యదర్శులు కన్వీనర్లుగా వ్యవహరించారు. ప్రజాపాలన, మీ సేవ సహా ఇతర మార్గాల ద్వారా ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా అర్హుల జాబితాను తయారు చేసి గ్రామసభల్లో ప్రదర్శించారు. ఉదయం 9 గంటలకు సభలు ప్రారంభమయ్యాయి. అధికారులు జాబితాను చూపించి లబ్ధిదారుల పేర్లు చదివిన వెంటనే అర్హులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు.
ఆ జాబితాలో తమలాంటి అర్హుల పేర్లు లేకుండా ఇప్పటికే పథకాలు పొందిన అనర్హులు పేర్లు ఎలా ఉన్నాయంటూ అధికారులను నిలదీశారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామసభకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హాజరయ్యారు. భద్రాద్రి జిల్లా చంద్రుగొండ మండలం మద్దుకూరు గ్రామసభలో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పాల్గొన్నారు. తమకు ఇంటి జాగా ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేదని, భూములు ఉన్న వారికి ఆత్మీయ భరోసా వర్తింపజేస్తున్నారని, తాము నిరుపేదలమైనా రేషన్ కార్డుల జాబితాలో మా పేర్లు లేకుండా చేశారని, లబ్ధిదారుల జాబితాలో అనేక అక్రమాలు జరిగాయని ప్రజలు తిరగబడ్డారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన గ్రామసభల్లో నిరసనలు హోరెత్తాయి. ఇదివరకే స్వీకరించిన దరఖాస్తులు, ఇటీవల చేసిన సర్వేల ఆధారంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాల అర్హుల జాబితాను ప్రకటించారు. అర్హుల పేర్లను అధికారులు గ్రామసభల్లో చదివి వినిపించారు. ఇదివరకే పథకాలు పొందిన వారి పేర్లు, అనర్హుల పేర్లు ఆ జాబితాలో ఉండడాన్ని గమనించిన అర్హులు, నిరుపేదలు.. అధికారులను ఎక్కడికక్కడ నిలదీశారు. నిరుపేదలమైన తమ పేర్లు అర్హుల జాబితాలో ఎందుకు లేవని? ప్రభుత్వ పథకాలను తమకు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు.
సమాచారం లేని కారణంగా ఇల్లెందు నాలుగో వార్డులో గ్రామసభ వెలవెలబోయింది. అర్హత కలిగిన ప్రజలకు పథకాల జాబితాలో ఎందుకు చోటు కల్పించలేదంటూ ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో సీపీఎం, సీపీఐ, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. గ్రామసభలో అధికారులను నిలదీశారు. భద్రాద్రి జిల్లా పినపాక మండలం తోగ్గూడెం గ్రామసభలోని అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రజల ఆందోళన కారణంగా దమ్మపేట మండలం ఆళ్లపల్లి గ్రామసభ అర్ధాంతరంగా నిలిచిపోయింది. బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లిలో అధికారుల తీరును నిరసిస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు.
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామసభలో ప్రజలు అధికారులపై తిరుగుబాటు చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్నది. కొణిజర్ల మండలం తీగలబంజర గ్రామంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇంటింటి సర్వే చేయకుండానే లబ్ధిదారుల జాబితా ఎలా తయారు చేశారంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తింపజేయాలని అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కూసుమంచి మండలం గట్టుసింగారం, మల్లాయిగూడెం, నేలపట్ల, చౌటపల్లి గ్రామసభల్లో కూడా గందరగోళం నెలకొంది. అనర్హులకు జాబితాలో చోటు కల్పించారంటూ అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు.
అర్హుల గుర్తింపు కోసం ఏ అధికారీ క్షేత్రస్థాయిలో తన విచక్షణాధికారం మేరకు నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా కన్పించలేదు. కేవలం తమకే సర్వాధికారాలు ఉన్నట్లుగా గ్రామాల్లో స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వ్యవహరించినట్లు స్పష్టమవుతున్నది. వారి సూచనల మేరకు అర్హులను (కాంగ్రెస్ కార్యకర్తలను) ముందే గుర్తించినట్లు, లబ్ధిదారులు ఎంపిక ఏకపక్షంగా జరిగిపోయినట్లు జాబితాలను పరిశీలిస్తే తేటతెల్లమవుతోంది. అందుకే గ్రామసభల్లో ప్రజలందరూ అధికారులను నిలదీశారు. తమకు అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ, ఇప్పటికే రెండుమూడుసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమను ఎందుకు అర్హులుగా గుర్తించలేదని ప్రశ్నించారు. ఎన్నో ఆశలతో వచ్చిన ప్రజలు కూడా ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఇంటి ముఖం పట్టారు. అయితే మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులు దాటవేశారు.
‘ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పారు. అందరికీ పథకాలు అందిస్తామంటూ మాయమాటలు చెప్పారు. మా అందరి దగ్గరా దరఖాస్తులు తీసుకున్నారు. చివరికి గ్రామసభల్లో మాలాంటి అర్హుల పేర్లు లేకుండా చేశారు. డబ్బున్నోళ్లకే పథకాలు ఇస్తారా? ఇళ్లు ఉన్న వాళ్లకే మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తారా? గతంలో లబ్ధి పొందిన వాళ్లే ఇప్పుడూ లబ్ధిదారులు ఎలా అవుతారు? మాకు జాగాలు ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు మంజూరు చేయలేదు?’
-ఇవీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం నాటి గ్రామసభల్లో దరఖాస్తుదారులు వేసిన ప్రశ్నలు.
చుంచుపల్లికి చెందిన కోడి ముత్యాలు అనే మహిళ రోడ్డుపై నాలుగు చక్రాల బండి పెట్టుకొని బజ్జీలు విక్రయించుకుంటూ జీవిస్తున్నది. ఆమెకు సొంత ఇల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటూనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో పెట్టిన ప్రజాపాలన సభల్లో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ.. మంగళవారం తమ ఊరి గ్రామసభలో ప్రకటించిన లబ్ధిదారుల పేర్లలో ఆమె పేరు లేదు. దీంతో గుండెలోంచి ఉప్పొంగిన బాధతో గ్రామసభలోని అధికారి వద్దకు వెళ్లింది. ‘నేను నిరుపేదను కాదా?’ అంటూ ప్రశ్నించింది. ‘అర్హుల జాబితాలో నా పేరు ఎందుకు రాలేదు?’ అంటూ నిలదీసింది. దీంతో అధికారులు ఆమెకు సర్దిచెప్పారు. ‘మళ్లీ పేరు రాయించుకో.. ఈసారి వస్తది’ అంటూ బుజ్జగించారు.
-ఇలాంటి బాధితులు ఒక్కరుకాదు.. ఇద్దరు కాదు.. ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారు. మంగళవారం నాటి గ్రామసభల్లో వెల్లడించిన అర్హుల జాబితాలో తమ పేర్లు లేవంటూ పేదలంతా ఆందోళనలు వ్యక్తం చేశారు. అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ తమ పేర్లు జాబితాలో ఎందుకు పొందుపర్చలేదో చెప్పాలంటూ అధికారులను నిలదీశారు. ‘మాలాంటి అసలైన పేదలకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్లు రావా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
వంద రోజుల పని పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు పనికి పోతూనే ఉన్నా. గతంలో ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు దరఖాస్తు చేసుకున్నా. ఈరోజు మా ఊర్లో జరిగిన గ్రామసభ లిస్టులో నాపేరు రాలేదు. ఎందుకు రాలేదు అని అడిగితే.. ఎవరూ కచ్చితంగా జవాబు చెప్పలేదు. మా ఊర్లో సీనియర్ మేట్‌ను కూడా. నా భర్త చనిపోయాడు. పుట్టెడు కష్టాల్లో ఉన్న నాకు న్యాయం చేయాలి. ఈ పథకానికి నేను కచ్చితంగా అర్హురాలిని.
-కొప్పుల సంతోషమ్మ, మద్దులపల్లి, ఖమ్మం రూరల్ మండలం
కటిక పేదరికంలో ఉన్నా అధికారులు కనికరించలేదు. ఉపాధి కార్డు ఉంది. నా పుస్తకం చూస్తే అర్థమవుతుంది. అటు ఇంటి జాబితాలో, ఆత్మీయ భరోసాలో సైతం నా పేరు రాలేదు. అధికారుల ముందు ఎంత అరిచి గీపెట్టినా ఎవరూ హామీ ఇవ్వలేదు. నా కొడుకు గ్రామసభలో మరోసారి ఈరోజు దరఖాస్తు ఇచ్చాడు. అధికారులు పేదోళ్లకు న్యాయం చేయాలి. ఆఫీసులో కూర్చొని పేదలు ఎవరో వాళ్లే రాసుకొని రావడం మంచి పద్ధతి కాదు.
-బొడ్డు జానకమ్మ, మద్దులపల్లి, ఖమ్మం రూరల్ మండలం
నాకు సెంటు భూమి లేదు. ఇల్లు లేదు. కానీ.. నన్ను ఏ పథకంలో లబ్ధిదారుడిగా ఎంపిక చేయలేదు. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ భరోసా కోసం దరఖాస్తు చేసుకున్నా. రేషన్ కార్డులో మా పిల్లల పేర్లు ఎక్కించేందుకూ దరఖాస్తు పెట్టుకున్నా ఎలాంటి ఫలితం లేదు. మేము ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉంటున్నాం. ఈసారి నాకు ఇల్లు వస్తుందని సంతోషపడ్డా. గ్రామసభలో నా పేరు రాలేదని చెప్పారు. ఇందులో ఏదో మతలబు ఉంది. అందుకే నా పేరు రాలేదు.
-వరికొప్పుల సురేశ్, మేడేపల్లి, ముదిగొండ మండలం
మా గ్రామంలో అర్హులెవరో, అనర్హులెవరో అధికారులైన మీకు తెలియదా? గ్రామసభలో పేర్లు చదివేదాకా అర్హులెవరో మీరు గుర్తించలేకపోయారా? అలాంటప్పుడు ఈ గ్రామసభ ఎందుకు? అసలు ఇవేం గ్రామసభలు? ఇళ్లు ఉన్నవాళ్లకే ఇళ్లు ఇస్తున్నారు. ఇంటి స్థలం ఉన్న చాలామందికి ఇళ్లు రావడం లేదు. అందరికీ న్యాయం చేయాలి. ఉన్నోడికో న్యాయం లేనోడికో న్యాయం చేస్తారా? రెండో జాబితాలో కూడా నిజమైన అర్హుల పేర్లు లేకపోతే ఆఫీసు ముందు ధర్నా చేస్తాం.
-రమాకాంత్, ఎన్కే నగర్ గ్రామస్తుడు, చుంచుపల్లి
నేను 2023-24 సంవత్సరానికి గాను 23 రోజులపాటు ఉపాధిహామీ పనులు చేసినట్లు జాబ్ కార్డు ఉంది. అయినప్పటికీ అధికారులు ఆత్మీయ భరోసాకు అనర్హురాలిని అంటూ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి నేను ఉండే ఇల్లు కూలిపోయే స్థితిలో ఉంది. నాకు సెంటు భూమి కూడా లేదు. గ్రామసభలో అధికారులు తనను అనర్హురాలిగా ఎలా ప్రకటించారు. ఇది మీకు న్యాయం కాదు.
-గురినూరి కమలమ్మ, డబ్ల్యూ రేగుబల్లి, దుమ్ముగూడెం మండలం