మధిర, ఆగస్టు 28 : నేత్రదానం చేసి చూపు లేని వారికి చూపు కల్పించాలని రిటైర్డ్ ఎంపీడీఓ, ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ మెంబర్ మాధవరపు నాగేశ్వరరావు అన్నారు. గురువారం జాతీయ నేత్రదాన పక్షోత్సవంను పురస్కరించుకుని జిలుగుమాడులోని డ్రగ్ డీ ఎడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుందన్నారు. ఆ సమస్యలను అధిగమించడం కోసం దాతలు ముందుకు వచ్చి ఆయవయ దానాలు ఇస్తున్నారన్నారు.
దీనిలో భాగంగానే చూపు లేని వారికి వెలుగులు ప్రసాదించడం కోసం కొంతమంది వ్యక్తులు నేత్రదానం చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు. నేత్రదానంతో మరో జీవితానికి వెలుగులు నింపడం ఎంతో గొప్ప కార్యం అన్నారు. శరీరం వదిలిన తర్వాత ఆ శరీరాన్ని నిరుపయోగం చేయకుండా నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గోపాలరెడ్డి, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.