బోనకల్లు, ఏప్రిల్ 08 : గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఖమ్మం జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఆశాలత అన్నారు. మంగళవారం బోనకల్లు గ్రామ పంచాయతీ పరిధిలోనే వన నర్సరీ, స్మశాన వాటిక, డ్రైనేజీ వ్యవస్థతో పాటు పలు అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వేసవి దృష్ట్యా నర్సరీలో మొక్కలను కాపాడేందుకు పరదాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఉదయం, సాయంత్రం సమయంలో మొక్కలకు నీరు అందించాలని కార్యదర్శికి సూచించారు. ప్రజలు పారిశుధ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. డ్రైనేజీల్లో మురుగునీరు నిల్వ లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి రాకుండా మండల అధికారులు పర్యవేక్షణ చేసి తాగునీటిని సరఫరా చేయాలన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను ఆమె పరిశీలించారు. ఈమె వెంట ఎంపీఓ వెంకట కోటేశ్వరరావు, శాస్త్రి, సిబ్బంది ఉన్నారు.