ఖమ్మం, జనవరి 24: బీఆర్ఎస్ శ్రేణులు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం పార్టమెంటరీ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు విజయం కట్టబెట్టి విజయకేతనం ఎగురవేయాలన్నారు. ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలోకి వెళ్లి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించాలన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానన్నారు. తాను త్వరలో ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటిస్తానని, పార్టీ నాయకులను, కార్యకర్తలు, అభిమానులను ప్రత్యక్షంగా కలుస్తానని స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై గళమెత్తుతానన్నారు.
గురువారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలో జరిగే జిల్లా దిశా కమిటీ సమావేశంలో ప్రజాసమస్యలపై చర్చిస్తామన్నారు. అనంతరం నాయకులు, ప్రజాప్రతినిధులు వెలిబుచ్చిన సందేహాలను ఎంపీ నివృత్తి చేశారు. తర్వాత సమస్యల పరిష్కారం కోసం నగరానికి వచ్చిన ప్రజలు అందించిన వినతులు స్వీకరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాములునాయక్, వివిధ మండలాల నుంచి తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు తాళ్లూరి జీవన్, దండా పుల్లయ్య, బెల్లం వేణుగోపాల్, బాణాల వెంకటేశ్వరరావు, చిత్తారు సింహాద్రి యాదవ్, పోట్ల శ్రీను, చిరంజీవి, చెరుకుమల్లి రవి, మాలోత్ శకుంతల, కిశోర్, సుధాకర్, లక్ష్మీరెడ్డి ,చేబ్రోలు మల్లికార్జునరావు, పెంట్యాల పుల్లయ్య, బోజెడ్ల రామ్మోహన్రావు, ఏలూరి శ్రీనివాసరావు, కొమ్మినేని ఉపేందర్ పాల్గొన్నారు.