– అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్లో 1077, 9063211298 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
ఖమ్మం, రూరల్, ఆగస్టు 16 : ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదతో మున్నేరు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్డి అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మున్నేర నది పరివాహక ప్రాంతాల ముందస్తు జాగ్రత్తల కోసం శనివారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జలగంనగర్, కేబీఆర్ నగర్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డితో కలిసి కలెక్టర్ పర్యటించారు. మున్నేరు బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని, నీటి లెవల్ ను కలెక్టర్ పరిశీలించారు. మున్నేరు పరిసర ప్రాంతాలు బొక్కలగడ్డ, మంచికంటి నగర్లో ఇంటింటికి తిరుగుతూ స్ధానికులతో మాట్లాడారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలని పోలీస్, రెవెన్యూ అధికారులకు సూచించారు. వరద పెరిగే అవకాశం ఉన్నందున మున్నేరు నది, బ్రిడ్డిల పైకి ప్రజలు అనవసరంగా రావద్దని సూచించారు. వరద ఉన్న నేపథ్యంలో నీటి వనరులు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, ఖమ్మం రూరల్ సీఐ ముష్కారాజ్, తాసీల్దార్ పి.రాంప్రసాద్, మున్సిపల్, పోలీస్, ఇరిగేషన్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Khammam Rural : మున్నేరుకు వరద నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి