ఉవ్వెత్తున ఎగసిన అభిమానంతో గులాబీ సైన్యం ప్రవాహంలా కదిలింది. మెడలో గులాబీ రంగు కండువా.. చేతిలో బీఆర్ఎస్ జెండాతో బీఆర్ఎస్ శ్రేణులు తమ అభిమాన యువ నేతను చూసేందుకు పనులన్నీ వదిలి కేరింతలు కొడుతూ బైలెల్లారు. వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం నిర్వహించిన రోడ్ షో ప్రాంతం కిక్కిరిసిపోయింది.
యువ నేత కేటీఆర్ ప్రసంగిస్తున్నంతసేపు ఆసక్తిగా విన్న ప్రజలు ‘జై కేటీఆర్.. జై జై కేటీఆర్.. జయహో కేటీఆర్’ అంటూ నినదించారు. వారి ఉత్సాహాన్ని చూసిన కేటీఆర్ మీలో జోష్ బాగున్నదని విక్టరీ గుర్తు చూపిస్తూ ముందుకు సాగారు. భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు, ఇల్లెందులో బానోతు హరిప్రియా నాయక్, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
మంత్రి కేటీఆర్కు స్వాగతం పలికేందుకు సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు కోయ, లంబాడా నృత్యాలతో అలరించారు. యువకులు కేటీఆర్ ప్రసంగ పాఠాన్ని సెల్ఫోన్ల ద్వారా రికార్డు చేసుకున్నారు.