ఖమ్మం రూరల్, డిసెంబర్ 09 : గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు, రాజకీయ నాయకుల బాధ్యత ఉంటుందని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట సర్కిల్ వద్ద గల రామ్ లీలా ఫంక్షన్ హాల్లో ఖమ్మం రూరల్ మండలంకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీ నాయకులతో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల 14న మండలంలోని గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రచార కార్యక్రమాలు ముగించాలన్నారు. ప్రతి గ్రామంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ తరపున, ఎన్నికల అధికారుల తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఎలాంటి అలజడులు, గొడవలకు తావిపోవద్దని, వ్యక్తిగత వివాదాలకు చోటు ఇవ్వరాదన్నారు. ఎన్నికల నియమాలను తప్పకుండా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, ఎన్నికల అధికారులు మాట్లాడుతూ.. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తే ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. 5 వేల లోపు ఓటర్లు కలిగిన గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.1,50,000, వార్డు అభ్యర్థి రూ.30 వేల లోపు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. గ్రామాల్లో అభ్యర్థులు చేసే ఖర్చుపై ప్రత్యేకంగా షాడో టీంలు పసిగడుతున్నాయన్నారు. ఓటర్లను పోలింగ్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చే బాధ్యత ఎన్నికల అధికారులే చూసుకుంటారని, రాజకీయ పార్టీల నాయకులు జోక్యం చేసుకోవద్దన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలు జరిగితేనే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని తద్వారా గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందన్నారు.
ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వొచ్చన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ర్యాలీలు, డీజేలకు అనుమతి ఉండబోదన్నారు. విజయం సాధించిన అభ్యర్థులు, పరాజయం పాలైన అభ్యర్థులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తే పోలీస్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో కేసులు నమోదు అయితే జీవితాంతం వెంటాడుతాయని, ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీ పీ సీ (ఏ ఆర్) విజయ్ కుమార్, శిక్షణ కలెక్టర్ అపూర్వ, తాసీల్దార్ పి.రాంప్రసాద్, ఎంపీడీఓ రవికుమార్, సిఐలు ముష్కరాజ్, తిరుపతిరెడ్డి, ఆయా గ్రామాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Khammam Rural : ప్రశాంత ఎన్నికలు ప్రతి ఒక్కరి బాధ్యత : సీపీ సునీల్ దత్