వరంగల్‌లో బీఆర్ఎస్ నిర్వహించనున్న రజతోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బయలుదేరేందుకు సన్నద్ధమవుతున్నాయి. 16 నెలల కాంగ్రెస్ పాలనలో అన్యాయం జరుగుతుండడం, పథకాలు అందకపోవడం వంటి కారణాలతో అన్ని వర్గాల ప్రజలూ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపుమేరకు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగసభకు హాజరయ్యేందుకు స్వచ్ఛందంగా పయనమవుతున్నారు. ఈ సభపై ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. దీంతో అనేక గ్రామాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా వాహనాలు సమకూర్చుకుంటూ ఎల్కతుర్తి సభకు సిద్ధమవుతున్నారు. దీంతో దారులన్నీ ఎల్కతుర్తివైపే చూపిస్తున్నాయి.
-ఖమ్మం, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీ సంఖ్యలో వెళ్లేందుకు ఆయా మండలాల పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ప్రతీ గ్రామం నుంచి బస్సులు బయలుదెరేలా, ఒక్కో బస్సుకు ఇద్దరు చొప్పున ఇన్చార్జులు ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. సభ ప్రారంభానికి ముందే ప్రాంగణానికి చేరుకునేలా ఇన్చార్జులు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. రజతోత్సవ సభ విజయవంతం కోసం పక్షం రోజులుగా ఉమ్మడి జిల్లాలో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.
పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ మదన్‌లాల్, బానోతు చంద్రావతి, తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తదితరులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి శ్రేణులను సన్నద్ధం చేశారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం, పాతికేళ్ల ప్రస్థానం, తెలంగాణ సాధన, పార్టీ అధినేత కేసీఆర్ కృషి వంటి అంశాలు; తెలంగాణను కాపాడుకునేందుకు చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణ వంటి విషయాలపై సభ జరుగనున్న నేపథ్యంలో కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలోనూ బీఆర్ఎస్ దిమ్మెలు నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు.
ఆదివారం ఉదయం సభకు బయలుదేరే ముందు పార్టీ దిమ్మెలపై గులాబీ జెండాలను ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత బస్సులు, ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి సభకు వెళ్లనున్నారు. ఎండకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు బస్సులు, వాహనాల్లో మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి సులభంగా చేరుకునేందుకు ప్రత్యేక రూట్మ్యాట్ రూపొందించారు. సభా ప్రాంగణం సమీపంలో భద్రాద్రి జిల్లా నుంచి వెళ్లే వాహనాలకు ఒక జోన్లో, ఖమ్మం జిల్లా నుంచి వెళ్లే వాహనాలకు మరో జోన్లో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు.
పార్టీ రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఎల్కతుర్తి సభకు పయనం కానున్నారు. అలాగే, నియోజకవర్గాల నుంచి కూడా ఇన్చార్జులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిసి సభకు బయలుదేరనున్నారు.
రజతోత్సవ సభ ప్రాధాన్యాన్ని వివరిస్తూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నేతృత్వంలో ఖమ్మంలో పెద్ద ఎత్తున వాల్‌రైటింగ్ చేపట్టారు. వాల్‌పోస్టర్లు అంటించారు. ప్రతి గ్రామంలోనూ పోస్టర్లు, వాల్‌రైటింగ్‌లు ఉండేలా పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ సమన్వయం చేశారు. పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కూడా నేతలతో కలిసి ఐదు నియోజకవర్గాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం చేశారు. ఎల్కతుర్తి సభకు వెళ్లేందుకు ఖర్చుల కోసం శ్రమదానం కూడా చేశారు.
సభకు వచ్చే శ్రేణులకు బీఆర్ఎస్ నేతల సూచనలు
ఖమ్మం, ఏప్రిల్ 26: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వేదికగా తలపెట్టిన రజతోత్సవ సభకు వచ్చే పార్టీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ, ఖమ్మంజిల్లా అధ్యక్షుడు తాతా మధు పలు సూచనలు చేశారు.
ఆటంకం కల్పిస్తే పింక్ బుక్‌లో నమోదు చేస్తాం..
ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు కార్యకర్తల, పార్టీ అభిమానుల సమరోత్సాహాన్ని చూసి ప్రభుత్వం గంగవెర్రులెత్తుతోంది. జిల్లా నుంచి సభకు వెళ్లే పార్టీ శ్రేణులకు ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు కల్పించే భవిష్యత్తులో సంబంధిత అధికారులు మూల్యం చెల్లించుకోకతప్పదు. ఉమ్మడి జిల్లా నుంచి భారీగా తరలివెళ్తున్న పార్టీ శ్రేణులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. సభకు వెళ్లే శ్రేణులను ఇబ్బంది పట్టే ప్రయత్నాలు చేసే వారిని భవిష్యత్తులో వదిలిపెట్టం. పింక్ బుక్‌లో నమోదు చేస్తాం.
-తాతా మధు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
అడ్డుకోవాలని చూస్తే అడ్రస్ లేకుండాపోతారు..
అణచివేతలతో తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేకపోయారు. ఇప్పుడు రజతోత్సవ సభకు కూడా ఆటంకాలు కల్పించలేదు. ఒకవేళ ఆటంకాలు సృష్టిస్తే అడ్రస్ లేకుండా పోతారు. వరంగల్ సభకు అన్ని జిల్లాల నుంచి గులాబీ దండు కదులుతుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మణుగూరులో 37 బస్సులు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి తనిఖీల బృందాన్ని పంపే ప్రయత్నం చేశారు. ఎంతలా అడ్డుకోవాలని ప్రయత్నించినా రజతోత్సవ సభ విజయవంతమవుతుంది. కాంగ్రెస్ దిష్టిబొమ్మ దగ్గం చేసి మరీ సభకు వెళ్తాం.
-రేగా కాంతారావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిలా అధ్యక్షుడు