రాష్ట్రంలో పామాయిల్ తోటల సాగును తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పంట సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తూ రాయితీలు ఇస్తోంది. రాష్ట్రంలో విస్తరిస్తున్న పామాయిల్ తోటల సాగుకు అనుగుణంగా.. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. క్రషింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ దినదినాభివృద్ధి చెందుతోంది అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ. పామాయిల్ గెలలను క్రషింగ్ చేయడమే గాక.. వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఆయిల్‌ఫెడ్ యాజమాన్యం రూ.89కోట్లతో ఫ్యాక్టరీని విస్తరిస్తోంది.
-దమ్మపేట రూరల్, జూలై 5
దమ్మపేట రూరల్, జూలై 5: అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రగతి పథంలో ముందుకు సాగుతూ తెలంగాణకు మణిహారంలా విలసిల్లుతోంది. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దినదినాభివృద్ధి చెందుతోంది. గంటకు 30 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభమైన ఫ్యాక్టరీ.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి గంటకు 90 మెట్రిక్ టన్నుల క్రషింగ్ సామర్థ్యానికి చేరుకోనుంది. విస్తరణ పూర్తయితే ప్రత్యక్షంగా వందమందికి, పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నిరుడు 2.64 లక్షల టన్నుల గెలలను క్రషింగ్ చేయగా ఈ ఏడాది 2.9 లక్షల టన్నుల గెలలను క్రషింగ్ చేసేలా లక్ష్యం ఉంది. ప్రస్తుతం గంటకు 60 మెట్రిక్ టన్నుల సామర్థ్యం అప్పారావుపేటలోనూ, 30 మెట్రిక్ టన్నుల సామర్థ్యం అశ్వారావుపేటలోనూ అందుబాటులో ఉంది.
రూ.89 కోట్లతో విస్తరణ పనులు..
ఫ్యాక్టరీ సామర్థ్యం పెంపునకు రూ.89 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుత పనుల్లో 90 మెట్రిక్ టన్నుల క్రషింగ్ విస్తరణకు రూ.29 కోట్లు, కాలుష్య నివారణ సంస్థ నిబంధనల ప్రకారం ఎంఈ ఏర్పాటుకు రూ.30 కోట్లు, బ్రాయిలర్ నిర్మాణానికి రూ.30 కోట్లు వెచ్చించారు. ఎంఈ నిర్మాణం పూర్తయి పూర్తి స్థాయిలో పని ప్రారంభమవుతుంది. తరువాత దీనికి అనుబంధంగా మరో రూ.15 కోట్లతో అల్ట్రా ఫిల్టరేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రస్తుతం వినియోగిస్తున్న నీటిలో 90 శాతం పొదుపు చేయడం ద్వారా భూగర్భ జలాలను కూడా ఆదా చేసుకోవచ్చు.
సాంకేతికతను అందిపుచ్చుకుంటూ..
టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, రైతుల సమస్యలను పరిష్కరిస్తూ ఆయిల్‌ఫెడ్ యాజమాన్యం ముందుకుసాగుతోంది. కొత్తగా విస్తరణ జరుగుతున్న 30 టన్నుల క్రషింగ్ యంత్రాల అమరికలో వర్టికల్ స్టెరిలైజర్లను వినియోగిస్తున్నారు. దీని వల్ల స్టెరిలైజేషన్‌లో అంతరాయాలు ఏర్పడకుండా క్రషింగ్ నిర్దేషిత సామర్థ్యానికి అనుగుణంగా జరుతుంది. తొలుత రూ.90 కోట్లతో 30 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. కేవలం క్రూడ్ పామాయిల్ ఉత్పత్తికి తోడుగా పామ్ కెర్నల్ ఆయిల్ (పీకేవో) మిల్లును రూ.15 ఏర్పాటు చేశారు. పెరిగిన పామాయిల్ తోటల విస్తరణకు అనుగుణంగా 30 నుంచి 60 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కోసం రూ.20 కోట్లతో ఫ్యాక్టరీని విస్తరించారు. తాజాగా రూ.89 కోట్లతో ఈ ఫ్యాక్టరీని ఆయిల్‌ఫెడ్ యాజమాన్యం విస్తరిస్తోంది.
ఓఈఆర్లో దేశానికే బెంచ్‌మార్క్‌గా..
తెలంగాణలోనే మొదటిసారిగా అశ్వారావుపేటలో 2007లో తొలి పామాయిల్ కర్మాగారం ఏర్పాటైంది. తొలి రోజుల్లోనే భారతదేశానికి బెంచ్‌మార్క్‌గా నిలిచింది. అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ పూర్తయ్యే వరకు అశ్వారావుపేటలో ఆయిల్ ఎక్షాట్రక్షన్ రేట్ (ఓఈఆర్) ఆధారంగానే తెలుగు రాష్ర్టాల్లో పామాయిల్ పండ్ల గెలల ధరను నిర్ణయించి రైతులకు చెల్లించేవారు. అప్పారావుపేట ఫ్యాక్టరీ పూర్తయిన తరువాత అశ్వారావుపేట ఫ్యాక్టరీ స్థానాన్ని ఇది సొంతం చేసుకుంది. అప్పారావుపేట ఫ్యాక్టరీలోని ఓఈఆర్ దేశంలోనే అత్యధికంగా 19.32గా రికార్డుకెక్కింది. దీని ఆధారంగానే ప్రైవేటు, ప్రభుత్వ ఫ్యాక్టరీల పరిధిలోని రైతులకు ధర నిర్ణయించి చెల్లింపులు జరుపుతున్నారు.
సెప్టెంబర్ నాటికి విస్తరణ పనులు పూర్తి చేస్తాం..
ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, పీఅండ్‌పీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డిల సూచనలతో సెప్టెంబర్ నాటికి విస్తరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇందుకు అనుగుణంగా పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి.
-కల్యాణ్, ఫ్యాక్టరీ మేనేజర్, అప్పారావుపేట