కూసుమంచి, సెప్టెంబర్ 27: సాగర్ జలాలు వచ్చి చేరడంతో పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం సమీపంలోని సూర్యాపేట జిల్లా నడిగూడెం రంగుల బ్రిడ్జి వద్ద ఇటీవల పడిన గండిని పరిశీలించిన రాష్ట్ర భారీ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కాల్వ పనులన్నీ ఒక్క రోజులోనే పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి జోన్ కింద నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోకుండా డ్యాం నుంచి నీటిని ఇవ్వాలని ఆదేశించారు.
దీంతో బుధవారం డ్యాం నుంచి నీటిని వదలడంతో శుక్రవారం తెల్లవారుజాము వరకు పాలేరుకు జలాలు చేరాయి. దీనికితోడు గత మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో వరద రావడంతో పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం పాలేరుకు సాగర్ నుంచి 1,200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. వరదతో 2,800 క్యూసెక్కులు వస్తున్నది. దీంతో పాలేరు నుంచి 2,800 క్యూసెక్కుల నీటిని జిల్లాలోని ఆయకట్టు పంటలకు వదులుతున్నారు.
పాలేరు పాత కాల్వకు 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథ తాగునీటి అవసరాల కోసం 135 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పాలేరుకు ఇన్ ఫ్లో 4,000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 3,135 క్యూసెక్కులు ఉండగా.. క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. ప్రస్తుతానికి పాలేరు నీటిమట్టం 19 అడుగులకు చేరింది. మళ్లీ అకాల వర్షాలు, వరదలు వస్తే ఇబ్బంది కలగకుండా పూర్తిస్థాయిలో కాకుండా రెండు నుంచి మూడు అడుగుల వ్యత్యాసంలో నీటిమట్టం ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు.
పాలేరు రిజర్వాయర్ పరిధిలోని సాగర్ ఎడమ కాల్వ రెండో జోన్ పాలేరు నుంచి కల్లూరు వరకు ఉండగా.. కల్లూరు నుంచి ఎన్టీఆర్ జిల్లా నూజివీడు వరకు మూడో జోన్ ఉంది. అయితే మంగళవారం తెల్లవారుజామున కాల్వ గండిని పూడ్చిన అధికారులు పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని వదిలారు. ఈ క్రమంలో భారీ వర్షం కురిసి కొంత ఊరట కలిగినా.. శుక్రవారం సాయంత్రం వరకు కూడా జిల్లా సరిహద్దు కల్లూరు వరకు సాగర్ జలాలు చేరలేదు. అయితే నీటిని ఎక్కువగా వదిలితే ఇటీవల మరమ్మతు చేసిన కాల్వకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో అధికారులు తక్కువగా నీటిని వదులుతున్నారు. పాలేరు నుంచి కనీసం 3,500 క్యూసెక్కుల నీటిని వదిలితే అన్ని మేజర్లు, మైనర్లకు నీరందుతుంది.
యూటీని పూర్తిగా మూసివేయడంతో పైనున్న పొలాల్లోకి నీరు చేరకుండా ఉండేందుకు 100 హెచ్‌పీ మోటర్లు ఒకచోట 4, మరోచోట 25 హెచ్‌పీ మోటర్లు రెండు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం యూటీ వద్ద నీటి నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాల్వ గండి, యూటీ లీక్ ప్రాంతాలను చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్ పరిశీలించారు. ఈఈ అనన్య, మంగలపుడి వెంకటేశ్వర్లు, డీఈలు మధు, రత్నకుమారి, రమేశ్, సిబ్బంది పనులను పర్యవేక్షిస్తున్నారు.
పాలేరు కాల్వ మరమ్మతు చేసిన యూటీ వద్ద నీటి నిల్వల తోడివేతపై కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఎప్పటికప్పుడు సీఈతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. గతంలో కాల్వ కట్ట ఎంత ఎత్తు ఉందో అదే స్థాయిలో కట్ట ఎత్తు పెంచారు.