కూసుమంచి, జూన్ 19: సంపూర్ణ ఆరోగ్యానికి మొక్కలే మూలమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అంతే బాధ్యతగా వాటిని నాటిన సంరక్షించాలని సూచించారు. పచ్చదనం సంపూర్ణంగా ఉంటేనే వాతావరణం మంచిగా ఉంటుందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం చేపట్టిన హరితోత్సవంలో కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలోని బృహత్ పల్లె ప్రకృతి వనంలోనూ, జాతీయ రహదారి పక్కన ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. హరితహారం కార్యక్రమంలో గ్రామాలన్నీ పచ్చగా కన్పిస్తున్నాయని అన్నారు.
హరితహారంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ప్రతీ గ్రామంలోనూ నర్సరీలను ఏర్పాటు చేస్తుండడం సంతోషకరమని అన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. హరితవనాల పచ్చదనంతో మంచి ఆరోగ్యం సమకూరుతోందని అన్నారు. గ్రామాల్లో ముమ్మరంగా హరితహారం మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. జిల్లాలో హరితహారం ప్రగతి గురించి డీఆర్డీవో విద్యాచందన వివరించారు. శిరీష, శంకర్‌నాయక్, వెంకట్రాం, బాణోత్ శ్రీనివాస్, ఇంటూరి శేఖర్, కంచర్ల పద్మారెడ్డి, బాణోత్ రాంకుమార్, మీనన్, కరుణాకర్‌రెడ్డి, రామచందర్‌రావు, అప్పారావు, కరుణ, కాసాని సైదులు, కచర్ల వీరారెడ్డి, వేముల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.