ఖమ్మం రూరల్, ఏప్రిల్ 13:హరిత ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి (దరిపెల్లి) రామయ్యకు ప్రకృతి ప్రేమికులు, గ్రామస్తులు, అధికారులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య.. ఈ నెల 12న తెల్లవారుజామున రామయ్య తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన విషయం విదితమే. ఆదివారం అతడి స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు రామయ్య అంత్యక్రియలు పూర్తిచేశారు.
రామయ్య తుదిశ్వాస విడిచిన దగ్గర నుంచి మొదలుకొని ఆఖరి మజిలీ పూర్తయ్యే వరకూ ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డిలు స్వయంగా అన్ని ఏర్పాట్లూ ఏర్పాచేశారు. అంత్యక్రియల సందర్భంగా స్వయంగా పాడె మోశారు. రామయ్య పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వనజీవి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోనే జరిగినప్పటికీ అధికారిక లాంఛనాలతో మాత్రం జరగలేదు.
అంత్యక్రియల్లో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు రెడ్డిపల్లిలోని రామయ్య ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర.. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. డీఎఫ్‌వో సిద్ధార్థ విక్రమ్‌సింగ్ చివరిసారిగా రామయ్య పార్దీవదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. అటవీశాఖ సిబ్బంది పరేడ్ అనంతరం అంతక్రియలు ముగిశాయి. అంతిమయాత్రలో పాల్గొన్న సామాజిక వేత్తలు వనజీవితో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని శోకసంద్రంలో మునిగిపోయారు. రామయ్య అంత్యక్రియలు పూర్తయిన అనంతరం అక్కడి వైకుంఠధామంలో ఆయన అభిమానులు మొక్కలు నాటారు. ఆర్డీవో నర్సింహారావు, అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు, ప్రముఖ సామాజిక వేత్తలు సురేశ్ గుప్తా, గడ్డం రాజశేఖర్, జిల్లా ఆసపత్రుల సమన్వయకర్త డాక్టర్ కేసగాని రాజశేఖర్, అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి నివాళి..
పద్మశ్రీ వనజీవి రామయ్య పార్దీవదేహానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, నీటిపారుదల, అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు తదితరులు ఆదివారం ఉదయం రెడ్డిపల్లిలోని రామయ్య ఇంటికి వెళ్లి ఆయన పార్దీవదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం రామయ్య సతీమణి జానకమ్మను పొంగులేటి ఓదార్చారు. నివాళులర్పించిన వారిలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, సీపీ సునీల్‌దత్, ఏసీపీ తిరుపతిరెడ్డి తదితరులున్నారు.
సొమ్మసిల్లి పడిపోయిన రామయ్య సతీమణి..
మరికాసేపట్లో వనజీవి అంతిమయాత్ర ప్రారంభం కాబోతున్న సమయంలో ఆయన సతీమణి జానకమ్మ ఒక్కసారిగా సొమ్మసల్లి కుప్పకూలిపోయారు. దీంతో అక్కడే ఉన్న బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తెల్లవారుజాము నుంచి అక్కడే ఉన్న రామయ్య సన్నిహితుడు, జిల్లా అసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ కేసగాని రాజశేఖర్ జానకమ్మకు అవసరమైన ప్రాథమిక వైద్యం అందించారు. వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి పరీక్షలు చేశారు. లో షుగర్, హై బీపీ కారణంతోనే సొమ్ముసిల్లపడిపోయినట్లు నిర్ధారించారు. అంబులెన్స్‌లో డాక్టర్ పర్యవేక్షణలో ఆమెను వైకుంఠధామానికి తీసుకొచ్చారు.