పంటలు పండించి అమ్ముకునే వరకు అష్టకష్టాలు పడుతున్న రైతన్నపై కాంగ్రెస్ సర్కారు విత్తన భారం మోపింది. వానకాలం కంటే ముందే ధరలను పెంచుతూ రేవంత్రెడ్డి సర్కారు రైతుపై పిడుగు వేసింది. నిరుటితో పోల్చితే రాయితీ (సబ్సిడీ) శాతం తగ్గించి ధరను రెండింతలు పెంచింది. నూరు శాతానికి పైగా పచ్చిరొట్ట విత్తన ధరలు పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన విత్తన ధరలతో భద్రాద్రి జిల్లా రైతులపై రూ.1.83 కోట్ల భారం పడుతోంది. సబ్సిడీ శాతాన్ని తగ్గించడంతో మరో 10 శాతం అంటే రూ.50.80 లక్షల ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది.
– అశ్వారావుపేట, మే 22
అప్పుల భారంతో అవస్థలు పడుతూ పంటలు సాగు చేస్తున్న రైతులపై రాష్ట్ర ప్రభుత్వం మరింత భారం వేస్తోంది. పచ్చిరొట్ట విత్తనాల ధరలను పెంచి ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టి వేస్తోంది. కష్టాన్ని నమ్ముకొని నష్టం వచ్చినా భరించే అన్నదాతలకు చేయూతనివ్వకపోగా ఏకంగా ధరలను పెంచి భారాన్ని రెట్టింపు చేస్తుంది. కేసీఆర్ పాలనలో పంటల పెట్టుబడి, ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధరలు, రాయితీ పథకాలు అందడంతో అన్నదాతలు ఉత్సాహంగా పంటలు సాగు చేశారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయి.
తమది రైతు ప్రభుత్వమంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారు.. అదును చూసి అన్నదాతలను దెబ్బ కొడుతోంది. ఇప్పటికే రైతు సంక్షేమ పథకాల అమలుపై చేతులు ఎత్తేస్తున్న దశలో తాజాగా వానకాలం సీజన్ కంటే ముందే పచ్చిరొట్ట విత్తన ధరలను రెండింతలకు పెంచింది. ఆర్థికంగా అన్నదాతలపై మోయలేని భారం మోపింది. పంటల బలం, భూమి సారవంతం కోసం రైతులు ఏటా తమ పొలాల్లో పచ్చిరొట్ట విత్తనాలను చల్లుతారు.
ఏపుగా పెరిగిన తర్వాత ఎరువుగా మార్చుకుని భూమిని సాగుకు సన్నద్ధం చేసుకుంటారు. ఇందుకోసం పచ్చిరొట్ట జాతికి చెందిన జీలుగు, జనుము, పిల్లి పెసర వంటి విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై రైతులకు సరఫరా చేయాల్సి ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో 30 కేజీల జీలుగుల విత్తన బస్తా ధర రూ.800 ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ధరను అమాంతం పెంచేసింది. ఈ ఏడాది ఈ ధర రూ.4,275కు చేరింది. అదేవిధంగా జనుము ధర రూ.5,020కు, పిల్లి పెసర ధర రూ.4,110కు చేరాయి.
తగ్గిన సబ్సిడీ.. పెరిగిన ధర
పచ్చిరొట్ట విత్తన ధరలను ప్రభుత్వం భారీగా పెంచడంతోపాటు సబ్సిడీని కూడా తగ్గించింది. నిరుడు సబ్సిడీ 60 శాతం ఉంటే.. దానిని ఈ ఏడాది 50 శాతానికి కుదించింది. దీంతో పెరిగిన ధరలతోపాటు అదనంగా రైతుపై మరో 10 శాతం ఆర్థిక భారం పడుతోంది. ఫలితంగా పచ్చిరొట్ట విత్తనాలను కొనుగోలు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు. అసలు పంటలు పండించడమే కష్టంతో కూడుకున్న పని. అందునా పండించిన పంటలను అమ్ముకోవాలంటే అందుకు రెండింతలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అప్పటికే ఆర్థికంగా చితికిపోతున్న అన్నదాతలు.. పెరిగిన ధరలతో భూమి సారవంతం కోసం అదనంగా పెట్టుబడిని వెచ్చించేందుకు వెనుకడుగు వేస్తున్నాడు.
రూ.1.83 కోట్ల భారం..
ప్రభుత్వం పెంచిన పచ్చిరొట్ట విత్తన ధరలతో భద్రాద్రి జిల్లా రైతులపై రూ.1.83 కోట్లకు పైగా భారం పడుతోంది. అలాగే సబ్సిడీని కూడా 60 శాతం నుంచి 50 శాతానికి తగ్గించడంతో అదనంగా రూ.50.80 లక్షలు భరించాల్సి వస్తుంది. ఈ ఏడాది జిల్లాకు 5 వేల క్వింటాళ్ల జీలుగులు, 400 క్వింటాళ్ల జనుము, 50 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ లెక్కన నిరుటితో పోల్చితే పచ్చిరొట్ట విత్తనాలపై రైతులకు రెండింతలు పెట్టుబడి ఖర్చు పెరుగుతోంది. పెట్టుబడి సాయం కింద రైతుభరోసా అందించని రేవంత్రెడ్డి ప్రభుత్వం.. ధరలను మాత్రం పెంచుకుంటూపోవడంతో అన్నదాతలపై అంతులేని భారాన్ని మోపినట్లవుతోంది.
ధర రెండింతలు పెరిగింది..
భూమి బలం కోసం సాగు చేసే పచ్చిరొట్ట విత్తనాల ధరలను రాష్ట్ర ప్రభుత్వం రెండింతలు పెంచింది. ధరలను ఇంతలా పెంచితే ఎలా కొనుగోలు చేయాలి. విత్తన ధరలను అమాంతం పెంచి అన్నదాతలపై ఆర్థిక భారం మోపుతోంది. ఇది అన్నదాతలను ఇబ్బందుల్లోకి నెట్టే నిర్ణయం. ధరలను వెంటనే తగ్గించాలి
-మొక్కిరాల శేషగిరిరావు, రైతు, అశ్వారావుపేట
సబ్సిడీ తగ్గించి ధర పెంచింది..
సబ్సిడీపై ఇచ్చే పచ్చిరొట్ట విత్తనాల ధరలను కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా పెంచింది. అంతేకాకుండా రాయితీని కూడా 60 శాతం నుంచి 50 శాతానికి తగ్గించింది. అన్నదాతలకు పంటల పెట్టుబడి సాయం అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వం.. ధరలను మాత్రం దర్జాగా పెంచేస్తోంది. ఈ పెంపుదల రైతును ఆర్థికంగా కుంగదీస్తోంది.
-పూసం వెంకటేశ్వర్లు, రైతు, చండ్రుగొండ