అశ్వారావుపేట/ దుమ్ముగూడెం/ ఇల్లెందు, అక్టోబర్ 11 : ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె భద్రాద్రి జిల్లాలో శనివారం నాటికి 30వ రోజుకు చేరింది. అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్లో కార్మికులు చేపట్టిన సమ్మె శిబిరాన్ని సీఐటీయూ నాయకుడు మురహరి సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం కనికరం కూడా లేదని మండిపడ్డారు.
తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దుమ్ముగూడెంలో చేపట్టిన కార్మికుల సమ్మె శిబిరాన్ని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు యలమంచి వంశీకృష్ణ సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇల్లెందు బాలికల ఆశ్రమ పాఠశాల ఎదుట సమ్మెలో కూర్చున్న కార్మికులనుద్దేశించి సీఐటీయూ జిల్లా నాయకుడు అబ్దుల్ నబి మాట్లాడారు.
ఇల్లెందు బాలికల ఆశ్రమ పాఠశాల, రొంపేడు, చెన్నంగులగడ్డ, బొజ్జాయిగూడెం, 15 నెంబర్ బస్తీ, కోరగుట్ట గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం సమస్యను పరిష్కరించడం లేదన్నారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో కార్మికులు శ్రీను, అరుణ, కరుణాకర్, లక్ష్మీ, వెంకట్, కాక కృష్ణ, హరిలాల్, సమ్మక్క, బాపనమ్మ, సత్యనారాయణ, రామకళ, లక్ష్మయ్య, లక్ష్మీనారాయణ. పద్మ, స్వరూప, రమణ, రఘుబాబు, సుబ్రహ్మణ్యం, విజయ, భారతి తదితరులు పాల్గొన్నారు.