ఖమ్మం అర్బన్, మార్చి 3: ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి మంగళవారం ఉదయం నుంచి ఇన్విజిలేటర్లకు డ్యూటీల కేటాయింపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తర్వులు అందుకున్న వారితో ఆయా కేంద్రాల సీఎస్, డీవోలు సమావేశం నిర్వహించి పరీక్ష నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించనున్నారు.
పరీక్షల నిర్వహణకు మొత్తం 892 మంది ఇన్విజిలేటర్లు కావాల్సి ఉండగా.. 322 మంది ఇంటర్ పరిధిలో అందుబాటులో ఉన్నారు. మిగతా 570 మందిని స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కేటాయించాలని ఇంటర్ విద్యాశాఖాధికారులు కోరారు. దీంతో డీఈవో సోమశేఖర శర్మ పాఠశాలలకు ఎలాంటి ఆటంకం లేకుండా అదనంగా ఉన్న టీచర్ల వివరాలను అందజేయాలని ఎంఈవోలకు సూచించారు. అత్యధికంగా ఖమ్మం అర్బన్ మండలంలోని పరీక్ష కేంద్రాలు ఉండడం.. ఇన్విజిలేషన్ చేయాల్సింది కూడా ఖమ్మంలోనే కావడంతో ఇతర ప్రాంతాల వారు సుముఖత చూపించడం లేదు.
దీంతో పూర్తిస్థాయిలో అవసరమైన ఇన్విజిలేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. అర్బన్ ఎంఈవో శైలజాలక్ష్మి.. డీఈవో, డీఐఈవోలను సమన్వయం చేసుకుంటూ ఉపాధ్యాయులను గుర్తించి ఇన్విజిలేషన్ విధులు కేటాయిస్తున్నారు. ఇతర మండలాల ఎంఈవోల నుంచి వివరాలు తెప్పించి అవసరమైన కేంద్రాలకు డ్యూటీలు వేస్తున్నా.. ఇంకా ఇన్విజిలేటర్ల కొరత ఉంది. 570 మందికి సోమవారం సాయంత్రానికి 400 మందికి పైగా విధులు కేటాయించారు.
కేంద్రాలను సందర్శించిన సీఎస్, డీవోలు
బోర్డు ఉన్నతాధికారుల ఆదేశాలు, డీఐఈవో సూచన మేరకు సోమవారం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నామినల్ రోల్స్ ఆధారంగా అవసరమైన బెంచీలు, తరగతి గదుల ఏర్పాట్లను సరిచూసుకున్నారు. పరీక్షల నిర్వహణలో అవసరమైన సామగ్రి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎక్కడైన సమస్యలుంటే ప్రైవేట్ పరీక్ష కేంద్రాలైతే ఆయా యాజమాన్యాలకు తెలియజేశారు. ప్రభుత్వ కేంద్రాలైతే డీఐఈవోకి వివరించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.