భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పదోన్నతుల వ్యవహారం పైరవీలతో పరేషాన్ చేస్తున్నది. పదోన్నతి పొందిన ఇద్దరు డీడబ్ల్యూవోలు పోస్టింగ్‌లు నచ్చకపోవడం.. ఆర్డర్లు వచ్చినా విధుల్లో చేరకపోవడంతో ఆ లొల్లి బజారునపడింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, బూర్గంపాడు ఐసీడీఎస్‌లలో పనిచేస్తున్న ఇద్దరు సీడీపీవోలకు సీనియార్టీ ప్రాతిపదికన జిల్లా సంక్షేమ అధికారులుగా పదోన్నతి కల్పించారు. ఈ నెల 13న కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఒకరిని ఖమ్మం జిల్లాకు.. మరొకరిని హనుమకొండ జిల్లాకు కేటాయించారు. అయితే వారిద్దరూ విధుల్లో చేరకపోవడంతో మళ్లీ ఆర్డర్లు మార్చే పరిస్థితి వచ్చింది. దీంతో పదోన్నతి పొందిన అధికారులు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు.
సీడీపీవో నుంచి డీడబ్ల్యూవోలుగా పదోన్నతి పొందిన ఆనందం వారికి లేకుండా పోయింది. ఖమ్మంలో జాయిన్ కావడానికి ఒకరు సుముఖత చూపించకపోవడం, హనుమకొండకు పదోన్నతిపై వచ్చిన మరో అధికారి అక్కడ జాయిన్ కావడానికి నిరాకరించడం.. దానికి ఆమెకు స్పౌజ్ కోటా ఉండడం వల్ల ఆర్డర్లు మార్చడానికి మరోసారి దరఖాస్తు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ములుగు, ఖమ్మం జిల్లాల మంత్రుల జోక్యంతో అధికారులు ఏ మంత్రి మాట వినాలో.. లేదా నిబంధనలు పాటించాలో.. తెలియక సతమతమవుతున్నారు. పదోన్నతులు పొందే సమయంలో సైతం మంత్రుల జోక్యం వల్ల నిబంధనలను తుంగలో తొక్కారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. డీడీ పోస్టుల్లో ఏడీలను వేయడం, ఏడీ పోస్టుల్లో డీడీలను వేయడం, భార్యాభర్తలకు వెసులుబాటు ఉన్నప్పటికి వారిని పక్కన పెట్టి పైరవీలకే అధికారులు తలొగ్గినట్లు తెలుస్తోంది.
ఒకసారి ఆర్డర్లు వచ్చిన తర్వాత మళ్లీ రీ ఆర్డర్లు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ పైరవీల సంస్కృతికి అద్దం పడుతుంది. దీంతో పైరవీల పదోన్నతుల వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ నెల 13న పదోన్నతుల ఆర్డర్లు ఇచ్చినా ఖమ్మం పోస్టింగ్ వ్యవహారంతోపాటు హనుమకొండలో మరో అధికారి జాయిన్ కాకపోవడంతో మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిసింది. రాత్రికి రాత్రి హైదరాబాద్‌లో పదోన్నతులు వచ్చిన అధికారులను పిలిచి కమిషనర్ కోరుకున్న చోటకు అవకాశం ఇచ్చినా చివరికి వారి చేతికి ఆర్డర్లు రాని పరిస్థితి నెలకొంది. దీంతో పదోన్నతుల వ్యవహారం మంత్రి టేబుల్ పైకి వెళ్లినట్లు తెలిసింది.
భద్రాద్రి జిల్లా డీడబ్ల్యూవో పోస్టు గురించి మొదటి నుంచి ఎవరూ ప్రయత్నం చేయకపోయినప్పటికీ చివరి నిమిషంలో ఇద్దరూ అదే పోస్టుకు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా ప్రాంగణ అధికారి.. జిల్లా సంక్షేమ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రెండోసారి జరిగిన కౌన్సిలింగ్లో ఇద్దరు అధికారులు భద్రాద్రి జిల్లానే కోరుకోవడంతో పదోన్నతుల ఫైల్ మంత్రి చేతికి వెళ్లింది. దీంతో మంత్రి ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనేది వేచిచూడాల్సిందే.