మామిళ్లగూడెం, నవంబర్ 17: స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించి నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణీత సమయంలో సమర్పిస్తామని బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్లోని కాన్ఫరెన్సు హాల్లో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల వర్తింపు అంశంపై ఉమ్మడి జిల్లా పరిధిలోని నిర్వహించిన బహిరంగ విచారణలో కమిషన్ చైర్మన్, కార్యదర్శి సైదులు, ఖమ్మం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
మొదట కలెక్టరేట్ ఆవరణలో రిజిస్ట్రేషన్ సెంటర్, నమోదు కేంద్రాన్ని కమిషన్ చైర్మన్ పరిశీలించారు. అనంతరం వివిధ సంఘాలు, వ్యక్తుల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. కమిషన్ చైర్మన్కు వడ్డెర సంఘం, సంచార జాతుల, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ, ముస్లిం మైనార్టీ, మత్స్యకారుల, ఆల్ ఇండియా ఓబీసీ కులాల, పూసల, చాకలి, దూదేకుల, యాదవ, గొల్ల కురుమ, సంచార ముస్లిం, కుమ్మరి, ఎంబీసీ సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలుపుతూ వినతిపత్రాలు అందించారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు దమాషా ఖరారు చేసేందుకు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో జనాభా వివరాలు వెల్లడించాలని, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కోసం అభిప్రాయ సేకరణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ ఉప సంచాలకులు వి.రమేష్, ఖమ్మం జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి జ్యోతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమాధికారి ఇందిర, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, సహాయ బీసీ సంక్షేమాధికారులు ఈదయ్య తదితరులు పాల్గొన్నారు.