టేకులపల్లి, డిసెంబర్ 30 : ప్రజా పాలన గ్రామసభల్లో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించిన దరఖాస్తులను మాత్రమే పూర్తి చేసిన తర్వాత స్వీకరించాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల అధికారులకు సూచించారు. శనివారం ప్రేగళ్ళపాడు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న ప్రజా పాలన గ్రామ సభను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి కౌంటర్ వద్దకు వెళ్లి దరఖాస్తుదారులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. అధికారులు ఇంటికి వచ్చి ఖాళీ దరఖాస్తులు ఇచ్చారా.. అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి ప్రజా పాలన దరఖాస్తులు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. జిరాక్స్ సెంటర్లలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా జిరాక్స్‌లు తీస్తే ఆయా సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఎస్సై, తహసీల్దార్‌ను ఆదేశించారు. అలాగే ప్రతి దరఖాస్తును సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించాలని, తప్పులు లేకుండా నింపే విధంగా చూడాలని సూచించారు.
మండలంలోని ఆరు ప్రాంతాల్లో చేపట్టిన గ్రామ సభలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నమోదు రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌రాజు, జడ్పీ సీఈవో విద్యాలత, డీపీవో రమాకాంత్, ఆర్డీవో శిరీష, నియోజకవర్గ ప్రత్యేకాధికారి కాశయ్య, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో కె.వీరబాబు, ఏపీవో రవికుమార్, సర్పంచ్ కణితి రమాదేవి, ఎంపీటీసీ బానోత్ సరోజిని, ఉప సర్పంచ్ పసుపులేటి మాధవి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.