ఖమ్మం అర్బన్, జూలై 5 : పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతుంటారు. విద్య ద్వారానే తమ సామాజిక, ఆర్థిక స్థితిగతులు మారుతాయని ఆశపడుతుంటారు. అయితే, ఇదే ఆశతో, ఆశయంతో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండడం లేదు. నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరితే.. అక్కడ అధ్యాపకుల కొరత కారణంగా ఆశించిన స్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందడం లేదు. పాఠాలు బోధించే అధ్యాపకుల సంఖ్య తగినం తస్థాయిలో లేకపోవడంతో.. ఎంతో నమ్మకంతో చేరిన విద్యార్థులు భవిష్యత్తు పట్ల ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
రాష్ట్ర ఇంటర్ విద్యాశాఖ మార్గదర్శకాల మేరకు ఖమ్మం జిల్లాలోనూ జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. తరగతులు మొదలై ఇప్పటికి నెల రోజులు దాటినా కొన్ని సబ్జెక్టుల్లో ఇంకా పాఠాల బోధనే ప్రారంభం కాలేదు. ఆయా సబ్జెక్టుల్లో అధ్యాపకుల కొరతే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, అధ్యాపకులు నియామకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ప్రభుత్వం గాలికి వదిలేసినట్లు కన్పిస్తోంది. ఖాళీగా ఉన్న పోస్టుల్లో కనీసం అతిథి అధ్యాపకులు నియమించి విద్యార్థులకు బోధన అందించేందుకూ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పేద విద్యార్థులకు సర్కారు కళాశాలల్లో నాణ్యమైన విద్య అందించే విషయం గాలిలో దీపంలా తయారైంది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రస్థాయికి చేరింది. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో విద్యార్థుల చదువులు గాడి తప్పుతున్నాయి. గతంలో ప్రమోషన్లు, ప్రసూతి సెలవులు, దీర్ఘకాలిక వైద్య సెలవులతో ఖాళీ అయిన పోస్టుల విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించేది. ఖాళీ స్థానాల్లో వెంటనే గెస్ట్ ఫ్యాకల్టీని నియమించేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధానాన్ని పక్కన పెట్టింది. ఫలితంగా విద్యార్థులు తరగతులు కోల్పోతున్నారు. వారిలో ప్రభుత్వ కళాశాలలపై విశ్వాసమూ సన్నగిల్లుతోంది.
ఖమ్మం జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా వాటిల్లో 66 జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని సబ్జెక్టుల్లో నెల రోజులుగా బోధన కొనసాగుతున్నా కొన్ని కీలక సబ్జెక్టుల బోధనకు అసలు అధ్యాపకులే లేరు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పలు కళాశాలల్లో ఒకే అధ్యాపకుడు రెండు మూడు సబ్జెక్టులను బోధించే పరిస్థితి నెలకొంది. ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత విద్యాసంవత్సరం మొత్తం కెమిస్ట్రీ అధ్యాపకుడు లేకుండానే గడిచింది. గెస్ట్ ఫ్యాకల్టీని కూడా నియమించలేదు. ఆ పోస్టు మంజూరు కాలేదనే కారణంతో సత్తుపల్లి సమీపంలోని కందుకూరు కళాశాల గెస్ట్ ఫ్యాకల్టీని వారంలో మూడు రోజులు మాత్రమే ఇక్కడికి పంపించి సర్దుబాటు చేశారు. దీంతో విద్యార్థులకు పూర్తిస్థాయి బోధన అందలేదు. ఇదే కళాశాలలో గణితం 1ఏ, 1బీ, 2ఏ, 2బీ నాలుగు పేపర్లను ఒక్క అధ్యాపకుడే బోధిస్తున్నాడు. రెండు పోస్టులు ఉన్నప్పటికీ భర్తి చేయకపోవడంతో ఒక్కరే బోధిస్తుండడంతో బోధన నాణ్యతపై ప్రభావం పడుతోంది. ఇదే పరిస్థితి అత్యధిక జూనియర్ కళాశాలల్లో ఉంది.
అధ్యాపకుల కొరత ప్రభావం విద్యార్థుల ప్రవేశాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గత విద్యాసంవత్సరంలో నయాబజార్ కళాశాల సైన్స్ గ్రూపులో 72 మంది విద్యార్థులు చేరగా ఈ ఏడాది కేవలం 46 మంది మాత్రమే చేరారు. అధ్యాపకులు లేరనే కారణంతో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలను దూరం పెడుతున్న పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో అయ్యే అడ్మిషన్లలో సగానికిపైగా ఖమ్మంలోని నయాబజార్, బాలికల కళాశాల, శాంతినగర్ కళాశాలల్లోనే ఉంటాయి. వీటిల్లో అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు అడ్మిషన్ పొందేందుకు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లా మొత్తంలో గత సంవత్సరం అడ్మిషన్లు 2,850 కాగా, ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు 2,330 మాత్రమే అయినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఖమ్మంలోని అతిపెద్ద ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చరిత్ర, గణిత శాస్త్ర అధ్యాపకులు ఉద్యోగోన్నతిపై వెళ్లినా ఆ స్థానంలో ఇప్పటి వరకూ అతిథి అధ్యాపకులను నియమించలేదు. కళాశాలలు ప్రారంభమైనప్పటి నుంచి అధ్యాపకులు రాకపోవడంతో మొదటి సంవత్సరం విద్యార్థుల్లో కొందరు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు (టీసీ) తీసుకొని ఇతర కళాశాలలకు వెళ్తున్నారు. ‘మా క్లాస్‌కు లెక్చరర్ ఎప్పుడు వస్తారు?’ అని అడిగితే ప్రిన్సిపాళ్ల వద్ద కూడా సమాధానం ఉండడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ వసతిగృహాల్లో ఉంటూ కొందరు విద్యార్థినులు అదే కళాశాలల్లో చదువుకుంటున్నారు. సమీప ప్రాంతాల విద్యార్థినులు కొందరు కూడా నిత్యం బస్సు, రైలు ద్వారా రాకపోకలు సాగిస్తూ అదే కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి ఈ కళాశాలలో సుమారు 700 మంది వరకు విద్యార్థినులున్నారు. ఇంతమంది విద్యార్థినులున్న ఈ కళాశాలలో కూడా అధ్యాపకుల కొరత ఉండడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని మరికొన్ని కళాశాలల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ప్రధానంగా వైరాలో ఫిజిక్స్, ముదిగొండలో ఎకనమిక్స్, పిండిప్రోలులో ఎకనమిక్స్, సివిక్స్, సిరిపురంలో కెమిస్ట్రీ, శాంతినగర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, నేలకొండపల్లిలో జువాలజీ, బోనకల్లులో జువాలజీ సబ్జెక్టుల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల స్థానంలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామక పక్రియ వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. జిల్లాలో 66 సబ్జెక్టు గెస్ట్ ఫ్యాకల్టీ అవసరం ఉంది. విద్యార్థులకు విద్యాబోధనలో నష్టం జరుగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
-రవిబాబు, డీఐఈవో, ఖమ్మం