ఖమ్మం, అక్టోబర్ 2:‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా మాకు సామాజిక పింఛన్లు కూడా ఇవ్వట్లేదు బాపూ..’ అంటూ ఖమ్మంలోని పలువురు వృద్ధులు, వితంతువులు, దివ్యాగులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పటికైనా మాకు పింఛన్లు మంజూరు చేయించేలా ప్రభుత్వానికి స్పృహ కల్పించండి మహాత్మా..’ అంటూ వేడుకున్నారు.
కొత్త ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు అవుతున్నా తమకు ఆసరా పింఛన్లు మంజూరు చేయడంలేదంటూ ఖమ్మం నగరంలోని 25వ డివిజన్‌కు పలువురు వృద్ధులు, వితంతువుల, దివ్యాంగులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి కూడా కావడంతో డివిజన్లోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడే మహాత్ముడి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ మేరకు అదే చిత్రపటానికి తమ పింఛన్ దరఖాస్తులను అందించి నిరసన తెలిపారు. నిరసన తెలిపిన వారిలో కందుకూరి ప్రదీప్‌కుమార్, ఎండీ అన్వర్, శ్రీను, తంగిశెట్టి అనసూయమ్మ , విజయలక్ష్మి, ముళ్లపాటి నాగమణి, బోనగిరి నాగమణి తదితరులు ఉన్నారు.