ఖమ్మం రూరల్, మే 17 : ఆయిల్‌పామ్ సాగుతో రైతులు మంచి ఆదాయం పొందవచ్చని కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు బి.సరిత అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుడిమల్ల గ్రామంలో రైతులకు ఆయిల్‌పామ్ సాగు విధానం, ప్రభుత్వ సహకారంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు సాంప్రదాయ పంటల సాగుకు స్వస్తి పలకాలన్నారు. మార్కెట్లో లాభదాయక పంటలను గుర్తించి సాగు చేస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ సాగు జిల్లా రైతాంగానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. తక్కువ నీటి వనరులతో ఎక్కువ ఎక్కువ ఎకరాల్లో సాగు చేయొచ్చన్నారు. అంతేకాకుండా ఈ పంట ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకుంటుందన్నారు.
ప్రభుత్వం భారీ రాయితీపై మొక్కలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% రాయితీ ఉండగా, ఇతర రైతులకు 90 శాతం రాయితీపై మొక్కలను అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ సైతం భారీ రాయితీతో అందిస్తున్నట్లు చెప్పారు. ఆయిల్‌పామ్‌లో అంతర పంటలను కూడా సాగు చేయొచ్చన్నారు. దీంతో రైతులు అదనపు ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఏడీఏ రూరల్ మండల ఏఓ ఉమా నాగేశ్, ఏఈఓ ఆదర్శ్, గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.