మధిర, మార్చి 8 : జలకళను సంతరించుకున్న జాలిముడి ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలోని రైతుల పంట భూములకు నీరందని పరిస్థితి నెలకొన్నది. నిత్యం నీటితో తొణికిసలాడుతున్న ప్రాజెక్టు కింద అధికారుల నిర్లక్ష్యంతో మోటర్ల సాయంతో పంట భూములకు నీటిని పారించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని జాలిముడి గ్రామం వద్ద నిర్మించిన జాలిముడి ప్రాజెక్టు ద్వారా రైతుల పంట భూములకు సాగునీరు అందించేందుకు కుడి, ఎడమ కాల్వలు ఏర్పాటు చేశారు. వీటి కింద సుమారు 4,700 ఎకరాలకు నీరు పారించాల్సి ఉంది.
అయితే జాలిముడి సమీపం నుంచి రొంపిమల్ల మల్లారం రైతుల భూముల్లో నుంచి ఎడమ కాల్వను పది అడుగుల లోతుతో తవ్వినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఎడమ కాల్వకు డిస్ట్రిబ్యూషన్ చానల్స్ ఏర్పాటు చేయకపోవడంతో సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు విద్యుత్ మోటర్లు, ఆయిల్ ఇంజిన్ల సాయంతో పంట పొలాలకు నీటిని పారించుకుంటున్నారు. అంతేకాక పది నెలల క్రితం తుఫాన్ కారణంగా వరద తాకిడికి 20 మీటర్ల మేర ఎడమ కాల్వ కాంక్రీట్ కొట్టుకుపోయింది.
ఈ క్రమంలో కాల్వకు అటు, ఇటు కలుపుతూ రెండు 250 ఎంఎం ప్లాస్టిక్ పైపులైన్లను ఆనాడు నీటిపారుదల శాఖ అధికారులు అమర్చారు. ఆ పైపులైన్ ద్వారా సుమారు 2,700 ఎకరాలకు సాగునీరు సరఫరా కావాల్సి ఉంది. కానీ.. పైపులైన్‌కు నీరందకపోవడంతో కాల్వ పరిధిలో సాగు చేస్తున్న పంటలకు నీటి సరఫరా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు రైతులతో కలిసి జాలిముడి ప్రాజెక్టును సందర్శించి కొట్టుకుపోయిన కాల్వలు, పూడుకుపోయిన తూములను పరిశీలించారు. వెంటనే పూర్తిస్థాయిలో కాల్వ మరమ్మతు చేసి సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ఎడమ కాల్వకు ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ చానల్స్ ఏర్పాటు చేయలేదు. దీంతో నీరందకపోవడంతో బోరు బావుల్లోని నీటిని మోటర్ల ద్వారా పారించుకుంటున్నాం. తుఫాన్ వల్ల కొట్టుకుపోయిన కాల్వకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయకపోవడం వల్లే ఇన్ని ఇబ్బందులు. వెంటనే అధికారులు మరమ్మతు చేపట్టి సాగునీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి.
-బాదినేని వెంకటరామయ్య, రైతు, రొంపిమల్ల, మధిర మండలం
పది నెలలుగా జాలిముడి ప్రాజెక్టు ఎడమ కాల్వకు సాగునీటి సరఫరా నిలిచిపోయింది. వరదల కారణంగా ఎడమ కాల్వ కొట్టుకుపోయింది. అధికారులు దీనికి తాత్కాలికంగా పైపులైన్లు వేసి మరమ్మతు చేశారు. అయినా నీరు సరఫరా కావడం లేదు. చేసేది లేక బోరు బావులపై ఆధారపడి పంటలు సాగు చేయాల్సి వస్తున్నది. ప్రాజెక్టు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది.
-శీలం కృష్ణారెడ్డి, రైతు, జాలిముడి, మధిర మండలం