నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పరిధిలో గురువారం జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ కోసం పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఖమ్మంలో కలెక్టరేట్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో గల రామచంద్ర డిగ్రీ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన కేంద్రాలకు బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. ఖమ్మం జిల్లాలో 4,089 మంది ఉపాధ్యాయ ఓటర్ల కోసం 24 పోలింగ్ కేంద్రాలు, భద్రాద్రి జిల్లాలో 2,022 మంది ఓటర్ల కోసం 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది గురువారం నాటి పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు.
ఖమ్మం, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని 21 మండలాల నుంచి మొత్తం 4,089 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్లలో పురుషులు 2,372, స్త్రీలు 1,717 మంది ఉన్నారు. వీరిలో ప్రాథమిక పాఠశాలలు తప్ప ఉన్నత పాఠశాలలతోపాటు ఉన్నత తరగతులకు బోధించే వారు ఓటుహక్కు కలిగి ఉన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, ప్రధానోపాధ్యాయులు, జూనియర్ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్, ఇదే తరహాలో మోడల్ స్కూల్స్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పనిచేసే సీఆర్టీలు, స్పెషల్ ఆఫీసర్లు, యూనివర్సిటీ కళాశాలల్లోని ప్రొఫెసర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారిలో సైతం తమ సర్వీసులు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఓటుహక్కు కల్పించారు.
కలెక్టరేట్ కేంద్రంగా…
ఖమ్మం కలెక్టరేట్లోని సమావేశ మందిరం కేంద్రంగా ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని తరలించారు. జిల్లాలోని 24 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలు, ఇతర వస్తువులను అందజేశారు. సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్వో ఏ.పద్మశ్రీ, ఏవో ఎన్.అరుణ ఆధ్వర్యంలో ఎన్నికల సామగ్రిని అందించారు. ప్రతి కేంద్రానికి కేటాయించిన పీవో, ఏపీవో, అదనంగా కేటాయించమబడిన పీవోలకు అందజేశారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మండలాల వారీగా టేబుళ్లు కేటాయించి ఎన్నికలకు అవసరమైన వస్తువులను అందించారు. నిర్వహణకు అవసరమైన పెన్లు, సిరాను అందించారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి తీసుకున్న సామగ్రిని సెక్టోరల్ అధికారులు పూర్తి భద్రత మధ్య ఆయా మండలాల్లోని కేంద్రాలకు తరలించారు. ప్రతి మూడు కేంద్రాలకు ఒక్కో సెక్టోరల్ అధికారిని రూట్ అధికారిగా నియమించారు. ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని సిబ్బందికి అందజేసే ప్రక్రియను అదనపు కలెక్టర్ పిన్‌రెడ్డి శ్రీనివాసరెడ్డి బుధవారం పరిశీలించారు. పోలింగ్ విధులను సిబ్బంది పకడ్బందీగా చేపట్టాలన్నారు. పోలింగ్ కేంద్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను నిర్ణీత సమయంలో కేంద్రంలో అప్పగించాలని స్పష్టం చేశారు. రిసెప్షన్ పాయింట్‌కు చేరుకున్నాక వీటన్నింటినీ కౌంటింగ్ కేంద్రం నల్లగొండ జిల్లాకు తరలించనున్నారు.
మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ…
కలెక్టరేట్ నుంచి మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వీరు జరుగుతున్న ప్రక్రియను నిశితంగా పరిశీలించి అధికారులకు సమాచారం చేరవేస్తారు. 9 మంది సెక్టార్ అధికారులు, 28 మంది పీవోలు, 27 మంది ఏపీవోలు, 58 మంది ఇతర పోలింగ్ సిబ్బంది, 28మంది మైక్రో అబ్జర్వర్లు పనిచేస్తున్నారు. 8 రూట్లలో పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలిస్తున్నారు. వీటికోసం 8 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు.
Khammam3
బరిలో 19 మంది అభ్యర్థులు
ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 19 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. యూటీఎఫ్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ-టీఎస్ నుంచి పింగిళి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ నుంచి పులి సర్వోత్తంరెడ్డి, బీసీ సంఘాల మద్దతుతో టీచర్స్ జాక్ నుంచి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, కుడా మాజీ చైర్మన్ ఎస్.సుందర్రాజ్, ప్రజావాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు, స్వతంత్ర అభ్యర్థులుగా అర్వ స్వాతి, కంటె సాయన్న, డాక్టర్ కొలిపాక వెంకటస్వామి, గోపాల్‌రెడ్డి పన్నాల, ఏలె చంద్రమోహన్, చాలిక చంద్రశేఖర్, జంగిటి కైలాసం, జె.శంకర్, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు.
ఇందులో ప్రధాన సంఘాలకు చెందిన ఐదారుగురు గెలుపుపై ధీమాతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రతి ఓటరును కలిసే ప్రయత్నం చేశారు. యూటీఎఫ్ మినహా మిగతా ప్రధాన అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చివరి వరకు ప్రయత్నాలు కొనసాగించారు. ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వెచ్చించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇక మంగళ, బుధవారాల్లో మందువిందులు కూడా ఏర్పాటు చేశారు. వీటిపై యూటీఎఫ్ లాంటి సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశాయి. దీంతో ఈ ప్రలోభాల పర్వం గెలుపోటములను ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను నిమయ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని రామచంద్ర డిగ్రీ కాలేజీలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రిని పరిశీలించి, సిబ్బందికి కేటాయించిన విధులు, పోలింగ్ డైరీ, బాక్స్‌లు సీలింగ్ చేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి జరిగే పోలింగ్ సరళిపై గంటగంటకూ సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లా కేంద్రంలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఎక్కువగా ఉన్నందున చివరి క్షణంలో ఓటర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బస్సు అందుబాటులో ఉంటుందని, సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియగానే పీవోలు, ఏపీవోలు బస్సులలో సామగ్రితో నల్లగొండలోని స్ట్రాంగ్ రూంల వరకు వెళ్లాలని, మీ వెంట పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది ఉంటారని తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సీపీవో సంజీవరావు, ఆర్డీవో, తహసీల్దార్లు ఉన్నారు.
జిల్లాలో 23 కేంద్రాల్లో పోలింగ్..
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పరిధిలో గురువారం జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలోని 23 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లు 2,022 మంది ఉండగా.. అందులో మహిళలు 954, పురుషులు 1,068 మంది ఉన్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 అమలులో ఉంటుందని, పీవోలు 28 మంది, ఏపీవోలు 28, వోపీలు 28, ఓపీఓలు 28 మందిని నియమించినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది కోసం ప్రతి మండలానికి ఒక బస్సు కేటాయించామన్నారు. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఉపాధ్యాయులు ప్రాధాన్యతా క్రమంలో క్రమ సంఖ్య వేయాలని, పెన్నుతో టిక్ పెట్టకూడదని సూచించారు.