దమ్మపేట రూరల్, డిసెంబర్ 28 : ఓ సర్వేయర్ భూమిని సర్వే చేసిన రిపోర్టు ఇచ్చేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో శనివారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామ శివారులో మద్దినేని మమతకు 19.02 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనికి కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం రాకపోవడంతో సుమారు రెండు నెలల క్రితం మమత దరఖాస్తు చేసుకుంది.
అయితే పాస్‌బుక్ ఇచ్చేందుకు ముందుగా మండల సర్వేయర్ భూమిని సర్వే చేసి రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో సర్వేయర్ మెరుగు వెంకటరత్నం సర్వే చేసినా రిపోర్టు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడు. దీంతో రిపోర్టు కోసం మమత సోదరుడు మద్దినేని వెంకట్‌ను పలుమార్లు తిప్పించుకుంటూ రూ.1.5 లక్షలు లంచం డిమాండ్ చేసి.. రూ.50 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. అనంతరం వెంకట్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారు పన్నిన పథకం ప్రకారం.. సర్వేయర్‌కు రూ.50 వేలు ఇచ్చేందుకు శనివారం వెంకట్ ఫోన్ చేశాడు. జాతీయ రహదారిపై ఉన్న మందలపల్లి శివారు గాంధీనగరం ఇటుక బట్టీవద్ద రూ.50 వేలు నగదు తీసుకుంటుండగా అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు సర్వేయర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో రిమాండ్ చేస్తామని ఏసీబీ డీఎస్పీ రమేశ్ వివరించారు.
26న తహసీల్‌ను తనిఖీ చేసిన మంత్రి పొంగులేటి, 28న ఏసీబీ దాడి..
గతంలో ఎన్నడూ లేని విధంగా దమ్మపేట తహసీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 26న ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని ధరణి రిజిస్ట్రేషన్ రూమ్, ఎంఆర్ఐ-1 రూమ్‌లతోపాటు తహసీల్దార్ గదిలోని ఫైళ్లను తనిఖీ చేశారు. ఇటీవల రెవెన్యూ సేవలు పొందిన వారికి స్వయంగా ఫోన్లు చేసి పనుల్లో జాప్యం జరిగిందా? పనికి లంచం తీసుకుంటున్నారా? అని మంత్రి ఆరా తీశారు. ఈ క్రమంలోనే తాజాగా సర్వేయర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం జిల్లాలో సంచలనంగా మారింది.
పైస ముట్టందే సర్వే జరగదు..
సర్వేయర్ వెంకటరత్నం ఏసీబీకి పట్టుబడిన తర్వాత ఆయనపై ఉన్న ఆరోపణలు బహిర్గతమవుతున్నాయి. పైస ముట్టందే సర్వే జరగదని, రిపోర్టు ఇవ్వడని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో సర్వేకు వెళితే తీరొక్క విధంగా కొర్రీలు పెట్టి వేధించడం ఆయనకు పరిపాటి అని చెబుతున్నారు.