5 కేజీల తరుగు?
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ ఆదేశాలను అధికారులు ఖాతరు చేయడం లేదు. మిల్లర్ల ఒత్తిడితో క్వింటాకు 5 కేజీల తరుగు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసి పరోక్షంగా సహకరిస్తున్నారు. మిల్లర్లు పంతం నెగ్గించుకొని రైతును దోచుకోవడానికి ధాన్యం కొనుగోళ్లు మొదలుపెట్టారు. గత్యంతరంలేక, వాతావరణం అనుకూలించక రైతులు మిల్లర్ల దోపిడీకి తలవంచి పంటను అమ్ముకుంటున్నారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 78,294 ఎకరాల్లో వరి సాగైంది.
- ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
- పంతం నెగ్గించుకుంటున్న మిల్లర్లు
- గతిలేక అమ్ముకుంటున్న రైతులు
- పరోక్షంగా సహకరిస్తున్న అధికారులు
- ‘భద్రాద్రి’లో నష్టం రూ.24.63 కోట్లు
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ ఆదేశాలను అధికారులు ఖాతరు చేయడం లేదు. మిల్లర్ల ఒత్తిడితో క్వింటాకు 5 కేజీల తరుగు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసి పరోక్షంగా సహకరిస్తున్నారు. మిల్లర్లు పంతం నెగ్గించుకొని రైతును దోచుకోవడానికి ధాన్యం కొనుగోళ్లు మొదలుపెట్టారు. గత్యంతరంలేక, వాతావరణం అనుకూలించక రైతులు మిల్లర్ల దోపిడీకి తలవంచి పంటను అమ్ముకుంటున్నారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 78,294 ఎకరాల్లో వరి సాగైంది. దీని ద్వారా సుమారు 2,07,894 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అధికారులు అంచనా వేశారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు కోసం 5 కేజీల తరుగు ఇవ్వాల్సిందేనని పట్టబడుతున్నారు. ఈ లెక్కన జిల్లా రైతులు తరుగు పేరుతో రూ.24.63 కోట్లు ఆర్థికంగా నష్టపోతున్నారు.
– అశ్వారావుపేట, మే 6
పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడితో ఆర్థికంగా కుదేలవుతున్న అన్నదాతలు పంటను అమ్ముకునేందుకు కూడా నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర లభించక మిల్లర్ల దోపిడీకి గురవుతున్నారు. సమస్య పరిష్కరించాల్సిన అధికారులు సైతం పరోక్షంగా దోపిడీకి సహకరిస్తున్నారు. దీంతో రైతులు నిలువునా కుంగిపోతున్నాడు. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. మిల్లర్లకు సహకరించేందుకు ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేస్తోంది. వాతావరణంలో వస్తున్న మార్పులతో ఆందోళన చెందుతున్న రైతులు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆసరాగా చేసుకొని మిల్లర్లు 5 కేజీల తరుగు కావాల్సిందేనని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ పంతం నెగ్గించుకున్నారు. అధికారికంగా అనుమతి ఇవ్వలేని అధికారులు పరోక్షంగా సహకరిస్తూ మిల్లర్ల దోపిడీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. పంటల సాగు మొదలు దిగుబడులను అమ్ముకునే వరకు రైతులు అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటూనే ఉన్నారు. పండించిన పంటను కొనేందుకు ప్రభుత్వం సహకరించకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. దళారులకు అమ్ముకోలేక పడిగాపులు పడుతున్న రైతన్న పట్ల ప్రకృతి కూడా కనికరం చూపడం లేదు. అకాల వర్షాలతో పంట నాణ్యత దెబ్బతింటోంది. దీంతో భయపడుతున్న అన్నదాతలు అధికారులు చెప్పిన దానికి తలూపుతూ నష్టానికే పంటను తెగనమ్ముకుంటున్నారు.
భారీగా ధాన్యం దిగుబడి..
ఈ యాసంగిలో ధాన్యం దిగుబడులు భారీగా వచ్చాయి. మొత్తం 23 మండలాల్లో రైతులు 78,294 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో విత్తన ఉత్పత్తి కోసం 5,739, సన్నాలు 48,855, దొడ్డు రకం 23,700 ఎకరాల్లో ధాన్యం పండించారు. సన్నాలు ఎకరాకు 2.8 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 3 మెట్రిక్ టన్నులు దిగుబడి రావొచ్చని వ్యవసాయాధికారులు అంచనా వేశారు.
ఈ లెక్కన మొత్తం సాగు విస్తీర్ణం ద్వారా 2,07,894 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, ఇందులో రూ.500 బోనస్ కోసం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు సన్నాలను విక్రయిస్తారని, దొడ్డు రకం బయట మార్కెట్కు 20 శాతం పోయినా 80 శాతం రావొచ్చని లెక్కలు గట్టారు. సన్నాలు 48,855 ఎకరాల్లో పండించగా.. 1,36,794 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 23,700 ఎకరాల్లో పండించగా.. 71,100 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని, ఇందులో దొడ్డు రకం 20 శాతం బయట మార్కెట్కు పోయినా.. మిగతా 80 శాతం అంటే 1,93,674 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే రైతులు తీసుకొస్తారని, దానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్న అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రూ.24.63 కోట్లు నష్టం..
మిల్లర్ల డిమాండ్ మేరకు అధికారులు క్వింటాకు 5 కేజీల చొప్పున తరుగు తీస్తున్నారు. దీంతో జిల్లా రైతులు సుమారు రూ.24.63 కోట్లు నష్టపోతున్నారు. మొత్తం 78,294 ఎకరాల్లో వరి పంట సాగైంది. దీని ద్వారా 2,07,894 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మిల్లర్లు 5 కేజీల చొప్పున తరుగు తీస్తే 1,03,947 క్వింటాళ్లు కోల్పోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం క్వింటాకు రూ.2,369 చొప్పున 1,03,947 క్వింటాళ్లకు రూ.24,62,50,443 ఆర్థిక నష్టం భరించనున్నారు. ఈ దోపిడీ అంతా మిల్లర్ల ఖజానాకు చేరుతుంది.
ఇందులో అధికారుల వాటా ఎంతనేది మిల్లర్లు తేల్చాలనే వాదన వినిపిస్తోంది. కాయ కష్టం చేసి పండించిన పంట దోపిడీకి గురి కావడంతో అన్నదాతలు నిస్సహాయ స్థితిలో మిన్నకుండిపోతున్నారు. మార్కెట్ దోపిడీ సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే మిల్లర్లకు కొమ్ము కాయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వానకాలం పంట సీజన్ దగ్గర పడనుండటం, వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటుండడంతో అన్నదాతలు కూడా అందిన కాడికి అమ్ముకుని అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం సహకరించకపోయినా నమ్ముకున్న నేల తల్లి మేలు చేయకపోతుందా అనే చిన్న ఆశతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.
5 కేజీల తరుగు తీస్తున్నారు..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు 5 కేజీల చొప్పున అధికారులు తరుగు తీస్తున్నారు. తూర్పారబట్టినా తరుగు తీయాల్సిందేనని చెబుతున్నారు. ఇప్పటికే 20 రోజులకు పైగా ఎదురుచూశాం. అయినా ధాన్యం కొనలేదు. అందుకే అధికారులు చెప్పిన దానికి తరుగు ఇస్తున్నాం.
-తోట వెంకటేశ్వరరావు, రైతు, దమ్మపేట
ఎకరాకు రూ.వెయ్యి ఖర్చు..
ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా అది రైతు చేతికి అందడం లేదు. తరుగు తీయకూడదని ప్రకటిస్తున్న అధికారులు ఆఖరులో ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. తూర్పార పట్టడానికి ఎకరాకు అదనంగా రూ.వెయ్యి ఖర్చు అవుతోంది. దీనికి తోడు తరుగు ఇవ్వాల్సి వస్తోంది.
-రాజనాల శ్రీను(బూరియా), రైతు, అశ్వారావుపేట
గత్యంతరం లేక అమ్ముతున్నా..
గత్యంతరంలేకనే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకుంటున్నాం. తరుగు ఇచ్చి అదనపు ఖర్చులు పెట్టి ధాన్యం అమ్ముకుంటే నష్టమే వస్తోంది. ప్రభుత్వ వైఖరితో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.400 వరకు తక్కువ ధరకు అడుగుతున్నారు.
-పూసం వెంకటేశ్వర్లు, రైతు, చండ్రుగొండ
అధికారికంగా తరుగు తీయడం లేదు..
అధికారికంగా ఎక్కడా ధాన్యం కొనుగోలులో తరుగు తీయడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నాం. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం మొత్తం రైతుల నుంచి సేకరిస్తాం. రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
-అవధానుల శ్రీనివాసరావు, డీసీవో, కొత్తగూడెం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

