
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): యాసంగిలో ధాన్యం కొనలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రైతాంగం ఆరుతడి పంటలు సాగు చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయన పిలుపును అందుకున్న రైతులు ఈ సారి వరి స్థానంలో ఇతర పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.. ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు ఆరుతడి పంటలపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రాజెక్టులు, ఇతరజల వనరుల ఆయకట్టు రైతులు సదస్సుల్లో వరి సాగు చేయకూడదని తీర్మానం చేశారు.. మరోవైపు అగ్రికల్చర్ అధికారులు యాసంగికి ప్లాన్ సిద్ధం చేస్తున్నారు..
యాసంగిలో ధాన్యం కొనలేమని తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణ సర్కారు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తున్నది. దీనిలో భాగంగా భద్రాద్రి జిల్లా రైతులు వరి సాగును విడిచిపెట్టి ఇతర పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు డీఏవో అభిమన్యుడు, జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న, ఇతర వ్యవసాయశాఖ అధికారులు ఈ నెల 6వ తేదీ నుంచి 10 వరకు గ్రామాల్లో ఇతర పంటలపై అవగాహన సదస్సులునిర్వహించారు. వరి సాగుతో మున్ముందు కలిగే ఇబ్బందులను వివరించారు. 23 మండలాల పరిధిలోని 2 వేల హ్యాబిటేషన్లలో నిర్వహించిన సదస్సులకు సుమారు 8 వేల మంది హాజరయ్యారు.
ఇతర పంటల సాగు ఇలా..
గతేడాది యాసంగిలో రైతులు 1.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. దీనిలో వరి సాగు విస్తీర్ణమే ఎక్కువ. ఏటా సుమారు 78 వేల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈసారి ధాన్యం కొనలేమని చెప్పడంతో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని నిర్ధారణకు వచ్చారు. ఈ ఏడాది యాసంగిలో రైతులు కేవలం సీడ్ వరినే పండించనున్నారు. అది కూడా కేవలం రూ.5 వేలు ఎకరాల్లో మాత్రమే. భద్రాచలం డివిజన్ పరిధిలో చర్ల తాలిపేరు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఇప్పటికే వరి వేయడం లేదని తీర్మానం సైతం చేశారు. విత్తనోత్పత్తిలో భాగంగా జనుము వేస్తానమని ప్రకటించారు. దుమ్ముగూడెం మండల రైతులు సీడ్ వరి మాత్రమే సాగు చేస్తామని తేల్చి చెప్పారు. ఈసారి రైతులు పెసర, కందులు, మినుములు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఉలవలు, నూనె గింజలు, వేరుశనగ, పొద్దుతిరుడు, నువ్వులు, ఆయిల్ పాం, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయనున్నారు. మరో రెండు మూడు రోజుల్లో వ్యవసాయ శాఖ యాసంగి ప్లాన్ సిద్ధం అవుతుంది.
డిమాండ్ ఉన్న పంటలే సాగు…
కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొనలేమని తెగేసి చెప్పింది. నేను ఇతర పంటలు సాగు చేయాలని నిర్ణయించుకున్నాను. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలకు ప్రాధాన్యం ఇస్తా. రైతులు నిరుత్సాహ పడకుండా కూరగాయలు, అపరాలు, నూనెగింజలు సాగు చేసి లాభాలను ఆర్జించవచ్చు. పెట్టుబడికి ఎలాగూ ప్రభుత్వం రైతుబంధు అందిస్తుంది. సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలి.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు మేరకు రైతు వేదికల్లో ఇతర పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతుల నుంచి సానుకూల స్పందన వస్తున్నది. సీడ్ వరి తప్ప ఇతర వరి రకాలు సాగు చేయమని వారు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా ఆరుతడి పంటలు సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరికొన్ని రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతుబంధు కూడా జమ కానున్నది.
-కొర్సా అభిమన్యుడు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, కొత్తగూడెం