జూలూరుపాడు, ఫిబ్రవరి 6 : మండలంలోని పడమటనర్సాపురం సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న గుట్ట దగ్గరలో మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరను ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆదివాసీల ఆచార సంప్రదాయాలు ఉట్టిపడేలా కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లను శరవేగంగా చేపడుతున్నారు. ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించే జాతరకు భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నెల 8న పూజలతో జాతర ప్రారంభం కానుండగా 9న పుట్టబంగారంతో వనం నుంచి సారలమ్మను గద్దెల మీదకు తీసుకొస్తారు& 10న సమ్మక్కను వనం నుంచి గద్దెల మీదకుతీసుకరాగా 11న ఇద్దరు వనదేవతలను భక్తులు దర్శించుకోనున్నారు. తిరిగి సమ్మక్క-సారలమ్మలను 12న వనంలోకి సాగనంపుతామని కమిటీ సభ్యులు తెలిపారు.