సింగరేణి కొత్తగూడెం ఏరియాలో మిగిలిన ఏకైక ఉపరితల గని వెంకటేశ్ ఖని (వీకే ఓసీ) కూడా కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ దాహానికి బలైంది. నైనీ బొగ్గు బ్లాకుల టెండర్ల వ్యవహారంలో కాంగ్రెస్ సర్కారు కుంభకోణాలు కుట్రలు బయటపడిన నేపథ్యంలో వీకే ఓసీ ప్రైవేటీకరణ అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ సర్కారు జోక్యం స్పష్టంగా కన్పిస్తోందంటూ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో గౌతంఖని (జీకే ఓసీ)ని 30 ఏళ్లపాటు విజయవంతంగా నిర్వహించి 72 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసిన సింగరేణికి బొగ్గు ఉత్పత్తిలో అపారమైన అనుభవం, సామర్థ్యం ఉన్నాయి. అయినప్పటికీ వీకే ఓసీ బొగ్గు ఉత్పత్తిలో సింగరేణిని పక్కనపెట్టిన రేవంత్ ప్రభుత్వం.. ప్రైవేటుకు పెద్దపీట వేసింది. అది కూడా ముఖ్యమంత్రి బావమరిదికి చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించిందన్న ఆరోపణలున్నాయి. 2025, ఆగస్టు 9న ఆ ప్రైవేటు సంస్థ రంగంలోకి దిగి.. ఓవర్ బర్డెన్ (మట్టి తొలగింపు) పనులకు భూమిపూజ చేసింది.
-రుద్రంపూర్, జనవరి 24
వెంకటేశ్ ఖని (వీకే ఓసీ)లో 183.70 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఏడాదికి 5.3 మిలియన్ టన్నుల ప్రాతిపదికన 42 ఏళ్ల కాలపరిమితిలో మొత్తం బొగ్గును వెలికి తీయవచ్చునని సింగరేణి అంచనా వేసింది. ఎట్ పార్ రేటు, సైట్ విజిట్ సర్టిఫికెట్ వంటి కారణాలు చూపుతూ ఈ గనిని ముఖ్యమంత్రి బావమరిదికి ప్రభుత్వం అప్పగించిందన్న విమర్శలున్నాయి. దీంతో సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఉన్న ఏకైక గని అయిన వీకే ఓసీ కూడా ప్రైవేటుపరమైంది. అయితే, 1993లో ఇదే ఏరియాలో గౌతంఖని ప్రారంభమైనప్పుడు ఆ గనిలో 900 మంది కార్మికులు పనిచేసేవారు. 2022లో ఆ గని మూతపడే సమయానికి రిటైరైన కార్మికులుపోగా.. 640 మంది మిగిలారు. గౌతంఖనిని మూసివేసిన ఆ 640 మంది కార్మికుల్లో 170 మందిని వీకే ఓసీ కోసం కేటాయించారు.
మిగిలిన 470 మందిని సత్తుపల్లిలోని జేవీఆర్, కిష్టారం ఓసీలకు బదిలీ చేశారు. బదిలీపై వెళ్లేందుకు కార్మికులు అభ్యంతరం చెప్పారు. ఆ బదిలీలను నిలిపివేయాలంటూ టీబీజీకేఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించారు. అయితే, వీకే ఓసీ ప్రారంభం కాగానే ఆ 470 మందిని వెనక్కు రప్పిస్తామని అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఆ 470 మంది కార్మికులు ఇప్పటికీ రోజూ 120 కిలోమీటర్ల మేర కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, నాలుగు నెలల క్రితం వీకే ఓసీని ప్రైవేటుకు అప్పగించడంతో ఆ 470 మంది కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినట్లయింది. వీకే ఓసీలో ప్రైవేటు కార్మికులుకాక సింగరేణి చేయాల్సిన విధులను ఆ 170 మంది కార్మికులతోనే చేయిస్తున్నారు.
వీకే ఓసీ తవ్వకాలను సింగరేణే చేపట్టాలి..
గతంలో జీకే ఓసీలో ఓపెన్‌కాస్టులో పనిచేసిన కార్మికులను ప్రభుత్వం డిప్యూటేషన్ పద్ధతిపై సత్తుపల్లిలోని జేవీఆర్, కిష్టారం ఓసీలకు బదిలీ చేసింది. వీకే ఓసీ పనులు మొదలుపెట్టాక ఆ కార్మికులకు ఇక్కడికి తీసుకొస్తామని మాట ఇచ్చింది. ఇప్పుడు వీకే ఓసీని ప్రైవేటుకు అప్పగించి.. జీకే ఓసీ కార్మికులకు అన్యాయం చేసింది. వీకే ఓసీని ప్రైవేటుకు అప్పగించొద్దు. బొగ్గు తవ్వకాలను సింగరేణే చేపట్టాలి.
-కాపు కృష్ణ, టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ
ఆ ఒక్క ఓసీని కూడా ప్రైవేట్‌పరం చేశారు..
కొత్తగూడెం ఏరియాలో ఉన్న ఏకైక గని అయిన వీకే ఓసీని కూడా ప్రైవేట్‌పరం చేశారు. మరి ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల పరిస్థితేంటి? స్థానిక కార్మికులు ప్రతి రోజూ సత్తుపల్లికి వెళ్లి రావాల్సిందేనా? ఈ ఓసీలో బొగ్గు వెలికితీత సామర్థ్యం సింగరేణికి ఉంది. అయినప్పటికీ ప్రైవేటుకు అప్పగించడంవెనుక రాజకీయ కారణం ఉంది. దీని వల్ల సింగరేణి మనుగడకు ప్రమాదం పొంచి ఉంది.
-ఆసిఫ్, హెచ్ఎంఎస్ ఏరియా బ్రాంచి సెక్రటరీ