ఇల్లేందు : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) కమ్యూనిస్టులను ఉప్పుతో పోల్చడం సరికాదని కమ్యూనిస్టులు ( Communists ) అంటే నిప్పు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి , కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ( Koonamneni Sambashiva Rao ) అన్నారు.
ఆదివారం ఇల్లెందు పట్టణం జెకె కాలనీ సెంటర్లో సీపీఐ సీనియర్ నాయకులు ఏపూరి బ్రహ్మం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభ, స్తూప ఆవిష్కరణలో పాల్గొని మాట్లాడారు. ఇల్లందు ప్రాంతంలో ఏపూరి బ్రహ్మం సీపీఐ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేశారు. దేశంలో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సీపీఐ పార్టీ సిద్ధాంతాలు గురించి వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిస్టులంటే ప్రస్తుతం ఉప్పులా ఉన్నారని ఉప్పు తక్కువగా ఉంటే కూర టేస్ట్ ఉండనట్లని, కమ్యూనిస్టుల గురించి మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాల తరపున కమ్యూనిస్టులు పోరాడుతున్నారని అన్నారు. దేశానికి స్వతంత్రం రాక ముందు నుంచి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు.
దేశంలో అనేక పార్టీలు వస్తున్నాయి. పోతున్నాయి. పేదల పక్షాన పోరాడేది ఒక్క కమ్యూనిస్టులేనని వెల్లడించారు. అనంతరం జెకె సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఏపూరి బ్రహ్మం స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, ఖమ్మం జిల్లా నాయకులు హేమంతరావు, ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి కే సారయ్య, వివిధ జిల్లాల నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.